ఏపీ-ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఎంవోయూలు
క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సమ్మిళిత విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో నాలుగు వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.
మంత్రి నారా లోకేశ్, ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఉండవల్లిలో ఎంవోయూలపై సంతకాలు జరిగాయి. లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన ద్వారా ఈ ఒప్పందాలు సాకారమయ్యాయి.
ఫలించిన లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన
విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఇటీవల చేసిన ఆస్ట్రేలియా పర్యటన ఫలితాలు కనిపించడం ప్రారంభమయ్యాయి. ఆ పర్యటనలో ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతినిధులు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులతో జరిపిన చర్చల అనంతరం ఆంధ్రప్రదేశ్తో నాలుగు కీలక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయి. రాష్ట్రంలో పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలకు ప్రోత్సాహం కల్పించడమే వీటి ప్రధాన లక్ష్యం.
మొదటి ఒప్పందం ప్రకారం విశాఖలోని సెంటర్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (CoEET), ఐఐటీ తిరుపతి, ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW) కలిసి ఐఐటీ తిరుపతిలో సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్నాయి. అధునాతన సోలార్ పీవీ తయారీ, రీసైక్లింగ్, సాంకేతిక పరిశోధనలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధిపై ఈ కేంద్రం దృష్టి సారించనుంది.
రెండో ఎంవోయూ ద్వారా UNSW, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఏపీ సమగ్ర శిక్ష కలిసి ఆటిజం, ఇతర న్యూరోడైవర్స్ విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నాయి.
మూడో ఒప్పందం కింద ఏపీ ఉన్నత విద్యా మండలి, ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ డింపుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా విద్యార్థుల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఎంపిక చేసిన కళాశాలల్లో సాంకేతిక ఆధారిత పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నాయి.
నాలుగో ఎంవోయూ ప్రకారం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), డైనమిక్ లెర్నింగ్ సర్వీసెస్ (DLS) కలిసి వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలు చేపట్టనున్నాయి. ఈ ఒప్పందాలు రాష్ట్రాన్ని విద్య, పరిశోధన, స్వచ్ఛ ఇంధనం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో జాతీయ స్థాయిలో ముందంజలో నిలబెట్టేందుకు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Login
Comments (0)