కాదంబరి కేసులో దర్యాప్తు సంస్థలపై ఏబీ తీవ్ర విమర్శలు
విజయవాడ: డాక్టర్ కాదంబరి జెత్వానీ కేసులో వెలుగులోకి వస్తున్న పరిణామాలు రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థల పనితీరుపై తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని సెంటర్ ఫర్ లిబర్టీ ఛైర్మన్, మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.
విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చట్టం ఇప్పుడు సాధారణ పౌరులకు రక్షణగా కాకుండా, పలుకుబడి, రాజకీయ ప్రభావం, ఆర్థిక శక్తి ఉన్నవారి చేతిలో ఆయుధంగా మారుతోందని విమర్శించారు.
డాక్టర్ కాదంబరి జెత్వానీపై మొదట నమోదైన కేసు పూర్తిగా కల్పితమని, ఆ కేసులో ఉపయోగించిన పత్రాలు నకిలీవని, బ్యాక్‌డేట్ చేసినవని సీఐడీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులు, అధికారిక పత్రాలే స్పష్టం చేస్తున్నాయని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అలాంటి పత్రాలనే మళ్లీ ఆధారంగా తీసుకుని కొత్త చార్జ్‌షీట్ దాఖలు చేయడం న్యాయసూత్రాలకు విరుద్ధమని అన్నారు.
అలాగే ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తకు సంబంధించిన కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకే తనపై ఈ కేసు పెట్టారని జెత్వానీ చేసిన ఆరోపణలను సీఐడీ సమగ్రంగా దర్యాప్తు చేయలేదని విమర్శించారు.
సీఐడీ గతంలో సంక్లిష్ట కేసులను వృత్తిపరంగా దర్యాప్తు చేసే సంస్థగా పేరొందిందని, ఇప్పుడు మాత్రం రాజకీయ, ఇతర బాహ్య ప్రభావాలకు లోనైనట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. చార్జ్‌షీట్, బ్యాంకు లావాదేవీలు, ఫోరెన్సిక్ నివేదికలు, సాక్షుల వాంగ్మూలాల మధ్య అనేక వైరుధ్యాలు ఉన్నాయని ఆరోపించారు. చట్టంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు సంస్థాగత సంస్కరణలు అవసరమని సూచించారు.
ఈ సందర్భంగా కడపలో ప్రతిపాదిత జిందాల్ స్టీల్ ప్రాజెక్టుపైనా ఆయన స్పందించారు. సుమారు రూ.4,500 కోట్ల పెట్టుబడితో వచ్చే ప్రాజెక్టుకు భారీ నగదు ప్రోత్సాహకాలు, విద్యుత్ సబ్సిడీలు, రహదారి, రైల్వే సదుపాయాలు, నీటి కేటాయింపులు ఇవ్వడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజా వనరులను ఇంత భారీగా ఒకే ప్రాజెక్టుకు కేటాయించడం సముచితమేనా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని అన్నారు.
సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి మాట్లాడుతూ, కాదంబరి జెత్వానీ కేసులో వెలుగులోకి వచ్చిన అంశాలపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగ హక్కులు, చట్టపరమైన సమానత్వాన్ని కాపాడేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు.
Login
Comments (0)