రేపు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు
అమరావతి: రాష్ట్రంలోని విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్రకటించింది. ఈ బంద్‌లో విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి గోపీకృష్ణ పిలుపునిచ్చారు.
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా విద్యా రంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు డిమాండ్లతో బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు.
ఏబీవీపీ ప్రధానంగా రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, డిగ్రీతో పాటు అన్ని కోర్సుల ప్రవేశాలను పూర్తి చేసి ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు శాశ్వత భవనాలు నిర్మించి, నాణ్యమైన ఆహారం అందించాలని కోరింది.
అలాగే ప్రభుత్వ పరీక్షల (అక్రమ పద్ధతుల నిరోధక) సవరణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 'ఏ' కేటగిరీ విద్యార్థుల నుంచి అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేసింది. జీవో నెం.77ను రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు ఖాళీ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరింది.
ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని, కార్పొరేట్, ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని నియంత్రించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఏబీవీపీ డిమాండ్ చేసింది.
విద్యా రంగ సమస్యలు పరిష్కరించే వరకు రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని యాగంటి గోపీకృష్ణ హెచ్చరించారు. విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Login
Comments (1)
18 hours agoWhy to control private and corporate institutes and damage them. Promote govt institutes in par. Automatically private and corporates gets their place.