సిలికానాంధ్రకు మూడు గిన్నిస్ రికార్డులు
అమరావతి: విదేశాల్లో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలను భావితరాలకు చేరవేసే లక్ష్యంతో పనిచేస్తున్న సిలికానాంధ్ర సంస్థ మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, ఓక్‌ల్యాండ్ ఎరీనాలో నిర్వహించిన సంస్థ రజతోత్సవాల్లో మూడు విభిన్న కార్యక్రమాలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. దీంతో సిలికానాంధ్ర ఇప్పటివరకు సాధించిన గిన్నిస్ రికార్డుల సంఖ్య 13కు చేరింది.
‘సంగీతామృతవర్షిణి’ కార్యక్రమంలో అన్నమాచార్య, త్యాగరాజు, భద్రాచల రామదాసు, ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలను 1,014 మంది గాయకులు సామూహికంగా ఆలపించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు సుధా రఘునాథన్ ఈ కార్యక్రమానికి సమన్వయం వహించారు.
‘లయామృతవర్షిణి’లో భాగంగా ప్రముఖ కళాకారులు తిరుచ్చి శంకరన్, డాక్టర్ పత్రి సతీష్ ఆధ్వర్యంలో 286 మంది మృదంగ విద్వాంసులు ఒకేసారి లయ విన్యాసాలు ప్రదర్శించారు. మరోవైపు ‘శతక శంఖారావం’ కార్యక్రమంలో వేమన, సుమతీ శతకాల నుంచి ఎంపిక చేసిన 18 పద్యాలను 1,712 మంది ఏకకాలంలో పఠించి మరో ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి మైకేల్ ఎంప్రిక్ అధికారిక ధ్రువపత్రాలను సిలికానాంధ్ర నిర్వాహకులకు అందజేశారు.
ఈ సందర్భంగా భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రవాస భారతీయుల్లో తెలుగు మూలాలను సజీవంగా ఉంచుతూ భావితరాలకు అందిస్తున్న సిలికానాంధ్ర సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కూడా సంస్థ సేవలను కొనియాడారు.
సంస్థ వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ, తెలుగు వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. సుమారు 10 వేల మంది ప్రవాస తెలుగువారు రజతోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యుడు డా. హనిమిరెడ్డి లక్కిరెడ్డి, మాజీ ఎంపీ డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తదితరులను జీవన సాఫల్య పురస్కారాలతో సత్కరించారు.
Login
Comments (0)