అధికారంలోకి రాగానే జైలుకి పంపిస్తాం - పెమ్మసానికి అంబటి తీవ్ర హెచ్చరిక
అమరావతి: "నువ్వు నేరస్తుడివి.. మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిన్ను అరెస్టు చేసి సంకెళ్లు వేసి జైల్లో పెడతాం" అంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఉద్దేశించి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించేందుకు పెమ్మసాని కుట్ర పన్నారని ఆరోపిస్తూ, పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన అంబటి, గతంలో తనను అర్ధరాత్రి పోలీసులు తీసుకెళ్లి దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఆ సమయంలో పోలీసు అధికారులు వంశీ, గంగా వెంకటేశ్వరరావులకు పెమ్మసాని ఫోన్ చేశారా లేదా చెప్పాలని ప్రశ్నించారు. తాను లాకప్‌లో ఉన్నప్పుడు "24 గంటల్లో నీకు సినిమా చూపిస్తాం" అని పెమ్మసాని హెచ్చరించారని అన్నారు.
పెమ్మసానిపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదని, ఆయన రాజకీయాలకు కొత్త వ్యక్తి అని అంబటి పేర్కొన్నారు. అయితే తన ఇంటిపై ఏడు గంటల 20 నిమిషాలపాటు దాడి జరిగినా పోలీసులు లాఠీచార్జి చేయలేదని, ఇప్పటివరకు ఒక్క నిందితుడినీ అరెస్టు చేయలేదని విమర్శించారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ నేతలపై మాత్రం వేగంగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.
వైసిపి మాజీ ఎమ్మెల్యే ముస్తాఫాపై కేసు గురించి కూడా మాట్లాడారు. నూజివీడులో జూలై 27న జరిగిన ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే అది వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివాదమని స్పష్టమవుతుందని అంబటి రాంబాబు అన్నారు. ఆ ఘటనకు రాజకీయ రంగు పులుముతూ తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.
Login
Comments (0)