అమెరికా దాడుల్లో ఇరాన్ అగ్రనాయకత్వమంతా తుడిచిపెట్టుకుపోయిందని, కనీసం చర్చలు జరపడానికి కూడా ఎవరూ మిగల్లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన ఇరాన్‌పై కీలక విమర్శలు గుప్పించారు.
ఇరాన్ వద్ద యుద్ధ విమానాలు, నౌకలు, నాయకులు లేరని ట్రంప్ స్పష్టం చేశారు. అగ్రశ్రేణి నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పోయారని, చర్చలు జరపడానికి ఎవరో ఒకరు కావాలి కదా అని పేర్కొన్నారు. శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. అమెరికాతో యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సహా పలువురు ప్రముఖ రాజకీయ, మిలిటరీ నేతలు మృతి చెందారు.
మరోవైపు అమెరికా దుందుడుకు చర్యలను నిశితంగా గమనిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించారు. మరోసారి యుద్ధం మొదలైనా తమ దేశ వైఖరి మారబోదని, గతంలో వచ్చిన ఫలితాలే పునరావృతమవుతాయని ఆయన స్పష్టం చేశారు. హర్మూజ్ కేంద్రంగా అడపాదడపా కాల్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Don’t receive OTP? Resend