రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అడ్డుకున్నా వెనక్కి తగ్గేది లేదు.. చొరబాటుదారులను దేశం నుంచి పంపిస్తాం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్)లో సుమారు 13 కోట్ల మంది పేర్లు తొలగించగా, వారిలో మూడు కోట్ల మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. దేశంలోని ఓటర్ల జాబితాల్లో కేవలం నిజమైన భారత పౌరులకు మాత్రమే స్థానం ఉండాలని స్పష్టం చేశారు. చొరబాటుదారులను దేశం నుంచి పంపించే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు.
సోమవారం హైదరాబాద్ పాతబస్తీలోని ఎంజే మార్కెట్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. అంతకుముందు 'ప్రజాస్వామ్యాన్ని కాపాడండి – అరాచకాన్ని తొలగించండి' నినాదంతో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థిస్తూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇప్పటివరకు సుమారు 13 కోట్ల పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించినట్లు అమిత్ షా వెల్లడించారు. వీరిలో 4.25 కోట్ల మంది రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదయ్యారని, మూడు కోట్ల మంది మరణించినప్పటికీ వారి పేర్లు జాబితాల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. మరో కోటి పేర్లు నకిలీ నమోదులని ఆరోపించారు. ఇలాంటి పేర్లను ఓటర్ల జాబితాల్లో కొనసాగించాలా? అని ప్రశ్నించారు. మిగిలిన పేర్ల తొలగింపునకు సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
రాహుల్, రేవంత్‌పై విమర్శలు
ఓటర్ల జాబితాల నుంచి అక్రమ చొరబాటుదారుల పేర్లను తొలగించడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా ప్రతి ఒక్క అక్రమ చొరబాటుదారుడిని దేశం నుంచి పంపించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని ప్రకటించారు.
కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎస్ఐఆర్ను వ్యతిరేకించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని అమిత్ షా ఆరోపించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులను తమ ఓటు బ్యాంకుగా భావిస్తున్నందునే ప్రతిపక్షాలు ఈ ప్రక్రియను అడ్డుకుంటున్నాయని విమర్శించారు. దేశంలోని ఓటర్ల జాబితాల్లో నిజమైన భారత పౌరుల పేర్లు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల ర్యాలీపై వ్యంగ్యాస్త్రాలు
ఆదివారం ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన ఉమ్మడి ర్యాలీపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో నిర్వహించిన ఆ సభను 'చొరబాటుదారులను కాపాడే ర్యాలీ'గా అభివర్ణించారు. ఎస్ఐఆర్పై ప్రతిపక్షాలు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ ప్రక్రియ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
ఎస్ఐఆర్ను నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, అయితే బీజేపీ మాత్రం ఈ ప్రక్రియకు పూర్తి మద్దతు ఇస్తుందని అమిత్ షా చెప్పారు. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పార్లమెంటు కార్యకలాపాలు సజావుగా సాగకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందని విమర్శించారు.
మాక్ పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావచ్చేమో కానీ, వాస్తవంలో మాత్రం ఆ పదవిని ఎప్పటికీ చేపట్టలేరంటూ ఆయనపై అమిత్ షా విమర్శలు గుప్పించారు.
Don’t receive OTP? Resend