అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సన్నిహిత సిబ్బందికి భారీ కానుకలు అందించి ఆశ్చర్యపరిచారు. క్రిస్మస్ సందర్భంగా శాంటాక్లాజ్ బహుమతులు ఇచ్చినట్లుగా వ్యవహరిస్తూ, శ్వేతసౌధంలో తనకు నిత్యం సహకరించే నలుగురు కీలక సహాయకులకు విలువైన బహుమతులు అందజేశారు. వైట్‌హౌస్ పరిపాలన విభాగం విడుదల చేసిన అధికారిక ఖర్చుల నివేదిక ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
నివేదికల ప్రకారం ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ నటాలీ హార్ప్, కమ్యూనికేషన్స్ అడ్వైజర్ మార్గో మార్టిన్, ఓవల్ ఆఫీస్ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఛాంబర్లైన్ హారిస్‌లకు ఒక్కొక్కరికి 45 వేల డాలర్ల చొప్పున ట్రంప్ కానుకలు ఇచ్చారు. దాదాపు మన కరెన్సీలో ఒక్కో బహుమతి విలువ రూ.42 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇదే సమయంలో ఓవల్ ఆఫీస్ ఆపరేషన్స్ డైరెక్టర్ వాల్ట్ నౌటాకు 20 వేల డాలర్ల విలువైన గిఫ్ట్‌ను ఆయన అందించారు.
ఈ బహుమతులకు సంబంధించి వైట్‌హౌస్ అధికారిక వర్గాలు స్పష్టతనిచ్చాయి. ఉద్యోగులకు ట్రంప్ ఇచ్చిన ఈ కానుకలు వారి అధికారిక ప్రభుత్వ విధులకు సంబంధించినవి కావని పేర్కొన్నాయి. దేశ నైతిక ప్రమాణాల ప్రకారం ఇవి పూర్తిగా అనుమతించదగినవేనని స్పష్టం చేశాయి. ట్రంప్ ప్రైవేట్ రంగంలో ఉన్నా, ప్రభుత్వ అధినేత బాధ్యతల్లో ఉన్నా తన సన్నిహితులకు ఇలాంటి క్రిస్మస్ బహుమతులు ఇవ్వడం సాధారణమేనని అధికార వర్గాలు వివరించాయి.
Don’t receive OTP? Resend