పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తున్న యెమెన్ హూతీ తిరుగుబాటుదారులకు భారీ ఆర్థిక ఆఫర్ ప్రకటించింది. దాడులను పూర్తిగా నిలిపివేస్తే ఒక బిలియన్ డాలర్లు అనగా దాదాపు రూ.9,500 కోట్లు ఇస్తామని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ రాజీకొచ్చారు.
సౌదీలోని చమురు క్షేత్రాలు, కీలక మౌలిక సదుపాయాలపై హూతీలు నిరంతరం దాడులు చేస్తుండటంతో ఆ దేశం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మధ్యవర్తిత్వంతో ఇరువర్గాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగానే హూతీలకు ఈ భారీ మొత్తాన్ని అందించేలా ఒప్పందం కుదిరినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగానే సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ ఇటీవల టెహ్రాన్ లో పర్యటించినట్లు సమాచారం.
గతంలో యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హూతీలతో సౌదీ అరేబియా ప్రత్యక్ష పోరుకు దిగింది. అయితే దేశంలోని విమానాశ్రయాలు, చమురు కేంద్రాలపై దాడులు మరింత తీవ్రం కావడంతో సౌదీ ఈ వ్యూహాత్మక మార్పునకు సిద్ధమైంది. అయితే ఈ ఆర్థిక ఆఫర్, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి సౌదీ అధికారిక వర్గాల నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Don’t receive OTP? Resend