దేశీయ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ఎల్టీసీజీ ట్యాక్స్ మినహాయింపు ఉంటుందన్న అంచనాలతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. దీనికితోడు ఈక్విటీల్లోకి విదేశీ నిధుల ప్రవాహం కొనసాగడంతో సూచీలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. వరుసగా నాలుగో సెషన్లోనూ సూచీలు రాణించాయి.
సెన్సెక్స్ ఉదయం 76,288.65 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై రోజంతా అదే జోరును కొనసాగించింది. చివరికి ఇంట్రాడే గరిష్ఠాల వద్ద 1,225.07 పాయింట్లు ఎగబాకి 76,917.85 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 370.05 పాయింట్లు పెరిగి 23,810.85 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, టాటాస్టీల్, ట్రెంట్ కంపెనీల షేర్లు మినహా మిగతావన్నీ లాభాల్లోనే ముగిశాయి.
ముఖ్యంగా హిందూస్థాన్ యునిలీవర్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఈక్విటీ ప్రతిఫలాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను రద్దు చేయాలని సెబీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇటీవలి రికార్డు స్థాయిలతో పోలిస్తే ధరలు దిగిరావడం మార్కెట్‌కు కలిసొచ్చింది. భారత ఈక్విటీల్లో విదేశీ సంస్థాగత మదుపర్ల కొనుగోళ్లు కొనసాగుతుండగా, సోమవారం ఒక్కరోజే రూ.3,115 కోట్ల మేర నిధులను పెట్టుబడి పెట్టారు. దీనికితోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పుంజుకోవడం, కార్పొరేట్ కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా రావడం సూచీల కదలికలకు సానుకూలంగా మారాయి.
Don’t receive OTP? Resend