ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఈ ఏడాది క్యూ-2లో స్టాండలోన్ ప్రాతిపదికన రూ.23,038 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు బ్యాంక్ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.20,160 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 14 శాతం అధికం కావడం గమనార్హం.
రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం ఈసారి ఎస్బీఐ మొత్తం ఆదాయం రూ.1,43,796 కోట్లకు చేరింది. గతేడాది ఇది రూ.1,34,979 కోట్లుగా ఉంది. ఇక కేవలం వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం రూ.1,19,654 కోట్ల నుంచి రూ.1,32,019 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 30 నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (Gross NPA) 1.73 శాతం నుంచి 1.39 శాతానికి తగ్గాయి. నికర మొండి బాకీలు 0.42 శాతం నుంచి 0.36 శాతానికి దిగివచ్చాయి. గతేడాది మొండి బకాయిల కోసం రూ.4,132 కోట్లు ప్రొవిజన్లు కేటాయించగా, ఈ ఏడాది ఆ మొత్తం రూ.2,759 కోట్లకు పరిమితమైంది.
ఏకీకృత ప్రాతిపదికన ఎస్బీఐ గ్రూప్ నికర లాభం 20 శాతం వృద్ధితో రూ.25,361 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం రూ.21,137 కోట్లుగా ఉంది. గ్రూప్ మొత్తం ఆదాయం సైతం రూ.1.75 లక్షల కోట్ల నుంచి రూ.1.87 లక్షల కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది.
Don’t receive OTP? Resend