అమెరికా, కెనడా దేశాల మధ్య విభేదాలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉన్న ప్రసిద్ధ లేక్ ఆంటారియో పేరును 'లేక్ అమెరికా'గా మారుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వైట్ హౌస్ ప్రకటించింది. ఎప్పటి నుంచో ఈ సరస్సు పేరు మార్చాలనే ఆలోచన తన మనసులో ఉందని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ట్రంప్ నిర్ణయంపై కెనడా అభ్యంతరం
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కెనడా ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పందిస్తూ.. అమెరికా విదేశాంగ విధానాలు, వాణిజ్య సంబంధాలు మారుతున్నాయని తమకు తెలుసని పేర్కొన్నారు. అయితే అమెరికా, కెనడా దేశాలు ఏర్పడకముందే ఈ సరస్సుకు ఆంటారియో అనే పేరు ఉందని, భవిష్యత్తులో కూడా అదే పేరుతో కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఆంటారియో ప్రావిన్స్ నేత డగ్ ఫోర్డ్ సైతం ట్రంప్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవేళ అమెరికా తమపై సుంకాలు విధిస్తే.. ఆ దేశానికి విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో పాటు కీలక ఖనిజాల ఎగుమతులను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
తిరస్కరించిన న్యూయార్క్ గవర్నర్
ట్రంప్ జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలపై అమెరికా లోపల కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. సరిహద్దు రాష్ట్రమైన న్యూయార్క్ గవర్నర్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించిన విధంగా సరస్సు పేరును మార్చబోమని ఆమె స్పష్టం చేశారు.
ఉత్తర అమెరికాలోని అత్యంత కీలకమైన ఐదు సరస్సులలో ఒకటైన లేక్ ఆంటారియో.. కెనడాలోని ఆంటారియో ప్రావిన్స్, అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రాల మధ్య విస్తరించి ఉంది.
ముదురుతున్న వాణిజ్య యుద్ధం
గత కొద్ది రోజులుగా అమెరికా, కెనడా మధ్య తీవ్రమైన వాణిజ్య యుద్ధం నడుస్తోంది. చివరి నిమిషంలో ట్రేడ్ డీల్ రద్దు కావడంతో తీవ్ర అసహనానికి గురైన ట్రంప్.. కెనడా నుంచి వచ్చే దిగుమతులపై 50 శాతం సుంకాలను విధించారు.
దీనికి ప్రతీకారంగా కెనడా సైతం అదే స్థాయిలో సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్రిక్తతల మధ్యే సరిహద్దు సరస్సు పేరును మారుస్తూ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత క్లిష్టతరం చేస్తోంది.
Don’t receive OTP? Resend