దేశ రాజధాని దిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం జరగనున్న ఇండియా కూటమి భారీ బహిరంగ సభకు పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ సభకు సుమారు 50 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో 4 వేల మందికి పైగా పోలీసు సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాల కంపెనీలను మోహరించనున్నారు. సభా ప్రాంగణాన్ని 14 జోన్లుగా విభజించి, 200కు పైగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్లు, బాడీ కెమెరాలు, ప్రత్యేక కంట్రోల్ రూమ్తో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. దిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ శనివారం మింటో రోడ్, రాంలీలా మైదానం ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.
సభకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. జనసమూహాన్ని క్రమబద్ధీకరించేందుకు నిర్వాహకులు ప్రత్యేక వాలంటీర్లను నియమించుకోవాలని పోలీసులు సూచించారు. అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ఎల్ఎన్జేపీ ఆసుపత్రి, జీబీ పంత్ ఆసుపత్రులకు వెళ్లే అంబులెన్సులు, ఇతర అత్యవసర వాహనాలు నిరాటంకంగా వెళ్లేలా ప్రత్యేక మార్గాలను అందుబాటులో ఉంచుతున్నారు.
ఈ భారీ బహిరంగ సభ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరం కానున్నాయి. వాహనాలను మళ్లించేందుకు పోలీసులు 10 కీలక ప్రాంతాలను గుర్తించారు. ప్రధాన రహదారులపై రాకపోకలకు అంతరాయం కలగనుండటంతో వాహదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు హెచ్చరించారు.
Don’t receive OTP? Resend