ప్రశ్నించే మహిళలను చూసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మహిళలను అణచివేసే ధోరణి దిల్లీలో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. దిల్లీ పోలీసులు ఇటీవల మహిళలపై దాడులు, దురుసు ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇటీవల జర్నలిస్టులు షహీన్ ఖాన్, నఫీసా ఖాన్లతో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని జర్నలిస్టులు తనతో చెప్పి ఆవేదన వ్యక్తం చేశారని రాహుల్ తెలిపారు. కెమెరాలు లాక్కొవడంతో పాటు వారిని ఈడ్చుకెళ్లడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వారి ఫిర్యాదుపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని పేర్కొన్నారు.
నిరసనల నేపథ్యం
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఇటీవల పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలో మహిళా నిరసనకారులు, జర్నలిస్టులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారనే తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీస్ స్టేషన్లోనే ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని రాహుల్ అభిప్రాయపడ్డారు. రక్షించాల్సిన వారే వారికి ప్రమాదంగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాకేత్ పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ దృశ్యాలను బహిర్గతం చేయాలని, బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Don’t receive OTP? Resend