న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధి సౌరవ్ దాస్ నివాసం వద్ద ఢిల్లీ పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు ఢిల్లీలోని ఆయన ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి వీడియోలు చేశారు.
ఆ సమయంలో సౌరవ్ దాస్ ఇంట్లో లేరు. ఆయన మహారాష్ట్రంలో ఉన్నారు.
తన వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తూ కొంతమంది ఇంటి వద్దకు చేరుకుని చిత్రీకరణకు ప్రయత్నిస్తున్నారని సౌరవ్ దాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భద్రతా చర్యలు తీసుకున్నారు.
సౌరవ్ దాస్ నివాస చిరునామా, ఇంటి అద్దె వివరాలు ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది విస్తృతంగా ప్రచారం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బుధవారం ఉదయం కొందరు యూట్యూబర్లు ఆయన ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, అనుమతి లేకుండా ఇంటి ఆవరణలోకి వెళ్లి వీడియోలు చిత్రీకరించేందుకు యత్నించారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సౌరవ్ దాస్ పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన అనంతరం ఢిల్లీ పోలీసులు ఆయన నివాసం వద్ద ప్రత్యేక బృందాన్ని మోహరించారు. పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
సౌరవ్ దాస్ ఈ ఘటనను తన భద్రతకు తీవ్ర ముప్పుగా అభివర్ణించారు. కొందరు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు ఇంట్లోకి చొరబడి లోపలి దృశ్యాలను చిత్రీకరించాయని ఆరోపించారు. వ్యక్తిగత గోప్యతను పూర్తిగా ఉల్లంఘించేలా ఈ చర్యలు జరిగాయని, రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగత జీవితంలోకి చొరబడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
అధికార బిజెపి అనుకూల యూట్యూబర్లే ఈ పనికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. The Pamphlet and DelhiTak వంటి యూట్యూబ్ చానెళ్లు సౌరవ్ దాస్ ఇంట్లో తిరుగాడి తీసిన చాలా వీడియోల్ని ప్రసారం చేశాయి.
ఇటీవలి నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై జరిగిన విద్యార్థుల ఉద్యమంలో కాక్రోచ్ జనతా పార్టీ కీలక పాత్ర పోషించింది. ఆందోళనల అనంతరం కేంద్ర విద్యాశాఖలో మార్పులు, ప్రభుత్వంతో చర్చలు జరగడంతో పార్టీ నాయకులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో వారి వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు రావడం, ఆ తర్వాత నివాసాల వద్దకు కంటెంట్ క్రియేటర్లు చేరుకోవడం గోప్యత, మీడియా నైతికతపై కొత్త చర్చకు దారితీసింది.
ఈ ఘటనపై జర్నలిస్టులు, డిజిటల్ మీడియా వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులపై వార్తలు ప్రసారం చేయడం ఒక విషయం కాగా, వారి వ్యక్తిగత నివాసాల్లోకి అనుమతి లేకుండా వెళ్లి చిత్రీకరణ చేయడం చట్టపరంగా, నైతికంగా సమర్థనీయమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
completed
శీర్షిక సరి చేయగలరు
Don’t receive OTP? Resend