ఢిల్లీ అలర్లు: అంకిత్ శర్మ హత్య కేసులో తాహిర్‌కు జీవిత ఖైదు
న్యూఢిల్లీ: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్పొరేటర్ తాహిర్ హుస్సేన్‌కు ఢిల్లీ కర్కర్డూమా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
తాహిర్ హుస్సేన్‌తో పాటు నజీమ్, ఖాసిం, జావేద్, అనాస్ అనే మరో నలుగురికీ జీవిత ఖైదు విధించింది. 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసుల్లో ఇది తొలి హత్య కేసు తీర్పు కావడం విశేషం. అల్లర్లకు సంబంధించిన ఇతర కేసుల్లో గతంలో కొన్ని శిక్షలు పడినప్పటికీ, హత్య కేసులో వచ్చిన తొలి తీర్పు ఇదే.
2020 ఫిబ్రవరిలో పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఉద్రిక్తతలు హింసాత్మక రూపం దాల్చి ఈశాన్య ఢిల్లీలో భారీ మత ఘర్షణలకు దారితీశాయి.
అల్లర్ల నేపధ్యం
2019 డిసెంబరులోపౌరసత్వ సవరణ చట్టం (CAA) పార్లమెంటులో ఆమోదం పొందింది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల నుండి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వాన్ని వేగంగా అందించేలా సవరణ చేశారు. ఈ చట్టంలో ముస్లింలని చేర్చకపోవటం వివక్ష చూపడమేనని దేశంలో చాలాచోట్ల ఆందోళనలు జరిగాయి.
మత ఘర్షణలు
ఈ నేపధ్యంలో ఢిల్లీలో నాలుగు రోజుల పాటు కొనసాగిన అల్లర్లలో 53 మంది మృతి చెందగా, వారిలో 36 మంది ముస్లింలు, 15 మంది హిందువులు ఉన్నారు. మరో ఇద్దరి గుర్తింపు నిర్ధారణ కాలేదు. 500 మందికిపైగా గాయపడ్డారు. ఇళ్లు, దుకాణాలు, ప్రార్థనా మందిరాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. అల్లర్లకు సంబంధించిన కుట్ర కేసులో పలువురు విద్యార్థి నాయకులు, సామాజిక కార్యకర్తలను యూఏపీఏ కింద అరెస్టు చేయగా, వారిలో కొందరు ఇప్పటికీ విచారణ ఖైదీలుగానే ఉన్నారు.
అంకిత్ శర్మ ఎవరు?
26 ఏళ్ల అంకిత్ శర్మ ఐబీలో సెక్యూరిటీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన సొంత పని మీద బయటకి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. 2020 ఫిబ్రవరి 25న అల్లర్ల సమయంలో అదృశ్యమైన ఆయన మృతదేహం మరుసటి రోజు చాంద్‌బాగ్ ప్రాంతంలోని డ్రెయిన్‌లో లభించింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఆయన శరీరంపై 51 కత్తిపోట్లు, తీవ్ర గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. కేవలం ఆయన హిందూ మతానికి చెందిన వ్యక్తి కావడమే లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని కోర్టు పేర్కొంది.
తీర్పులో తాహిర్ హుస్సేన్ హత్యకు పాల్పడిన అక్రమ గుంపులో సభ్యుడిగా ఉన్నట్లు కోర్టు నిర్ధారించింది. అయితే ఆయనపై మోపిన క్రిమినల్ కుట్ర అభియోగాన్ని నిర్ధారించలేదు. అభియోగపక్షం మరణశిక్ష కోరినా, నిందితులకు గతంలో నేరచరిత్ర లేకపోవడం, సంస్కరణకు అవకాశం ఉందనే కారణాలతో యావజ్జీవ శిక్ష విధించింది.
తాహిర్ హుస్సేన్ 2020లో నెహ్రూ విహార్ నుంచి ఆప్ కార్పొరేటర్‌గా ఉన్నారు. అల్లర్ల తర్వాత ఆప్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. అనంతరం ఆయన ఏఐఎంఐఎంలో చేరి 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాలు చేస్తామని ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు.
Login
Comments (0)