డిజిటల్ మోసాలకు సంబంధించి బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా బ్యాంకులను జవాబుదారీ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఖాతాల భద్రత పూర్తిగా ఆర్థిక సంస్థల బాధ్యత అని పేర్కొంది. డిజిటల్ అరెస్టు కేసులపై విచారణ జరిపిన ధర్మాసనం, ఈ తరహా మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉన్నట్లు రుజువైతే బాధితులకు వారు కోల్పోయిన మొత్తాన్ని కచ్చితంగా పరిహారంగా అందించాలని తెలిపింది.
ఖాతాదారుని సాధారణ లావాదేవీల సరళికి భిన్నంగా అసాధారణ లావాదేవీలు జరిగితే వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించింది. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి భౌతిక ధ్రువీకరణ ద్వారా లావాదేవీలను నిర్ధరించుకోవడం వంటి నివారణ చర్యలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. అటువంటి లావాదేవీల గురించి సమీప పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కూడా బ్యాంకులకు ఉందని స్పష్టం చేసింది.
ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, విద్యావంతులు సైతం డిజిటల్ అరెస్టుల పేరుతో మోసపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మొబైల్ ఫోన్లలో జరిగే ఇలాంటి మోసాల పట్ల ప్రజల్లో మరింత అప్రమత్తత అవసరమని అభిప్రాయపడింది.
Don’t receive OTP? Resend