హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్‌కు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లికి చెందిన శ్యామ్నాగ్ హైదరాబాద్‌లోని గోపన్‌పల్లి ఎన్టీఆర్నగర్లో నివసిస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. శనివారం రాత్రి ఆయన తన చిన్ననాటి స్నేహితుడు భార్గవ్రాజ్తో కలిసి గోపన్‌పల్లిలోని ఒక వైన్ షాప్‌లో మద్యం సేవించారు.
అనంతరం భోజనం చేసేందుకు ఎన్టీఆర్ నగర్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు శ్యామ్నాగ్ను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని అపహరించుకెళ్లారు. తన స్నేహితుడిని దుండగులు కిడ్నాప్ చేశారంటూ భార్గవ్రాజ్ వెంటనే అప్రమత్తమై డయల్ 112కి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి బాధితుడిని గుర్తించారు. కిడ్నాప్ అనంతరం దుండగులు శ్యామ్నాగ్ను ఓ నిర్మానుష్య ప్రాంతంలోని నిర్మాణ దశలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లారని తేలింది. అక్కడ కత్తితో బెదిరించి పలు కీలక డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు బాధితుడు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు బాధితుడిని సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Don’t receive OTP? Resend