హైదరాబాద్‌లోని మీర్పేట్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ అవినీతికి పాల్పడి కటకటపాలయ్యాడు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన మొబైల్ ఫోన్ నుంచి రూ.1.70 లక్షల నగదును కాజేయడంతో పాటు, అదే కేసులో స్వాధీనం చేసుకున్న 12 తులాల బంగారాన్ని సైతం తాకట్టు పెట్టాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మీర్పేట్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రవణ్ ఓ కేసులో భాగంగా ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లోని డిజిటల్ వ్యాలెట్ ద్వారా రూ.1.70 లక్షల నగదును తన బంధువుల బ్యాంకు ఖాతాలకు అక్రమంగా బదిలీ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా అదే కేసులో స్వాధీనం చేసుకున్న 12 తులాల బంగారాన్ని కూడా బయట తాకట్టు పెట్టి నగదు తీసుకున్నట్లు తేలింది.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో అంతర్గత విచారణ చేపట్టారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో కానిస్టేబుల్ శ్రవణ్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానిక పోలీసు వర్గాల్లో కలకలం రేపింది.
Don’t receive OTP? Resend