అనంతపురం జిల్లా రాప్తాడులో పదోతరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో పాశవిక దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీప్రాంతంలో నిందితుడు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన క్రమంలో ఆత్మరక్షణ నిమిత్తం, నిందితుడిని నిలువరించేందుకు పోలీసులు ఆరురౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.
రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న గోపికపై అదే మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన హేమంత్ గతంలో విచక్షణారహితంగా దాడి చేశాడు. వరుసకు బాబాయ్ అయ్యే నిందితుడు ఉదయం పాఠశాల తరగతి గదిలోకి అకస్మాత్తుగా ప్రవేశించి ఎలక్ట్రిక్ రంపంతో ఈ అమానుష ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ దాడిలో 15 ఏళ్ల బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్రమైన లోతైన గాయాలయ్యాయి. తరగతి గదిలో ఈ భయానక ఘటన జరుగుతుండగా తోటి విద్యార్థిని లక్ష్మి ఉన్మాదిని అడ్డుకునేందుకు ధైర్యంగా ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె రెండు కాళ్లకూ తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు కేకలు వేయడంతో నిందితుడు రంపాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు.
రక్తపుమడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలు గోపికతో పాటు గాయపడిన లక్ష్మిని స్థానికులు వెంటనే అనంతపురం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించేందుకు అక్కడి నుంచి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అక్కడ చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టిన పోలీసులు, అటవీ ప్రాంతంలో జరిపిన ఎదురుకాల్పులతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉన్మాద ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Don’t receive OTP? Resend