అనంతపురం జిల్లా రాప్తాడులో పదోతరగతి విద్యార్థినిపై రంపంతో దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి వివరాలు వెల్లడించారు. పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడికి ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు.
నిందితుడి కాళ్లకు తీసిన ఎక్స్రే రిపోర్టులలో ఎలాంటి బుల్లెట్లు కనిపించలేదని సూపరింటెండెంట్ తెలిపారు. అయితే కుడి కాలుకు తీవ్ర గాయం కావడంతో రక్తప్రసరణ సరిగా జరగక ఆ కాలు కుళ్లిపోయినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని చెప్పారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో హేమంత్ కుడి కాలును సగభాగం వరకు తొలగించాల్సి వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
నిందితుడి ఆరోగ్య పరిస్థితిని అనస్తీషియా వైద్య నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మల్లీశ్వరి వెల్లడించారు. ఎక్స్రే నివేదికతో పాటు అనస్తీషియా వైద్యుడి రిపోర్టును పూర్తిగా పరిశీలించిన తర్వాతే కాలు తొలగింపుపై తదుపరి వైద్య నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం గోపిక అనే విద్యార్థినిపై హేమంత్ రంపంతో దారుణంగా దాడి చేశాడు. ఆత్మకూరు అడవిలో అతడిని పట్టుకునే క్రమంలో సీఐపై దాడికి యత్నించడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాళ్లపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని పోలీసులు ఆదివారం రాత్రి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Don’t receive OTP? Resend