అయోధ్యలోని రామమందిరానికి ఓ భక్తురాలు భారీ మొత్తంలో ఇచ్చిన విరాళం చెక్కు బౌన్స్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెన్నైకి చెందిన ఓ మహిళా భక్తురాలు ఇటీవల అయోధ్య రామాలయాన్ని సందర్శించి, ఆలయ సిబ్బందికి అవసరమైన సౌకర్యాల కల్పన కోసం రూ.4 కోట్ల విలువైన చెక్కును శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సమర్పించారు. దీంతో పాటు ఆలయ అభివృద్ధి కోసం విడిగా మరో రూ.10 వేల నగదును విరాళంగా అందజేశారు.
ఖాతాలో కేవలం మూడు రూపాయలు
ఆమె అందజేసిన రూ.4 కోట్ల చెక్కును నగదుగా మార్చేందుకు ట్రస్ట్ సిబ్బంది బ్యాంకులో జమ చేశారు. అయితే ఖాతాలో తగినంత మొత్తం లేకపోవడంతో ఆ చెక్కు బౌన్స్ అయింది. అధికారులు ఖాతా వివరాలను పరిశీలించగా, సదరు మహిళ బ్యాంకు ఖాతాలో కేవలం రూ.3 బ్యాలెన్స్ మాత్రమే ఉన్నట్లు తేలడంతో ఆలయ వర్గాలు తీవ్ర విస్మయానికి గురయ్యాయి. ఖాతాలో నిధులు లేకుండానే ఇంత పెద్ద మొత్తానికి చెక్కు ఇవ్వడంపై సంబంధిత బ్యాంకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆమెకు నోటీసులు పంపనున్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి.
ట్రస్ట్ స్పందన
రూ.4 కోట్ల విరాళం ఇచ్చే సమయంలో ఆ మొత్తాన్ని కేవలం ఆలయ ఉద్యోగుల సంక్షేమం, సౌకర్యాల కోసమే ఖర్చు చేస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని ఆ భక్తురాలు కోరినట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొంది. అయితే అటువంటి నిబంధనలకు తాము అంగీకరించలేదని స్పష్టం చేసింది. చెక్ బౌన్స్ వ్యవహారంపై ప్రస్తుతం ఆ మహిళను సంప్రదించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని, భద్రతా కారణాల దృష్ట్యా ఆమె వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచామని ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు.
Don’t receive OTP? Resend