ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్ర ఎంపికయ్యారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన నియామకాన్ని అధికారికంగా ఖరారు చేశారు. ఆలయ పరిపాలన, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణను బలోపేతం చేసేందుకు ట్రస్టు ఈ కీలక నియామకం చేపట్టింది.
సీఈవో పోస్టు కోసం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ దేశవ్యాప్తంగా వచ్చిన 5,585 దరఖాస్తులను పరిశీలించింది. ఇందులో అర్హులైన 16 మందిని ఇంటర్వ్యూ చేసి ముగ్గురి పేర్లతో కూడిన తుది జాబితాను ట్రస్టుకు అందజేసింది. వైమానిక దళంలో దాదాపు 39 ఏళ్లపాటు సేవలందించిన జితేంద్ర మిశ్ర ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆయన 1986లో వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా చేరి, ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ విశేష సేవలందించారు.
ఈ నియామకంతో పాటు ట్రస్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన ప్రధాన కార్యదర్శిగా గోవింద్ దేవ్ గిరి ఎంపికయ్యారు. అలాగే మదన్మోహన్ పాండే, మహేశ్ భాగ్చంద్కా, డాక్టర్ నిర్మలా యాదవ్ కొత్త ట్రస్టీలుగా నియమితులయ్యారు. విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఆలయ నిర్వహణలో పారదర్శకత కోసం ట్రస్టు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
Don’t receive OTP? Resend