మహారాష్ట్రలోని పుణెలో రూ.8,300 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన మెట్రో లైన్-3 పింక్ లైన్ ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు మెట్రో రైలు ఫొటోలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మాణ్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు మెట్రో స్టేషన్ వరకు నిర్మించిన ఈ మార్గం ద్వారా వేలాది మంది ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికుల రోజువారీ రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని అధికారులు తెలిపారు.
ప్రత్యేకతలు ఇవే
సుమారు 23 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ మెట్రో లైన్ ప్రత్యేకత ఏమిటంటే దీనిని పూర్తిగా మహిళా ఆపరేటర్లే నిర్వహించనున్నారు. ఇలాంటి వినూత్న వ్యవస్థ దేశంలోనే మొదటిసారిగా అందుబాటులోకి వస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా ఈ మెట్రో లైన్ విద్యుత్ అవసరాలలో దాదాపు 30 శాతం మేర సౌరశక్తి ద్వారానే సమకూర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
రెండో దశ పనులకు శంకుస్థాపన
పుణె మెట్రో ప్రారంభంతో పాటు రూ.13,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మెట్రో ఫేజ్-2 పనులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండో దశలో భాగంగా లైన్ 2ఏ, 2బీ, లైన్ 4, 4ఏ కలిపి మొత్తం 44.39 కిలోమీటర్ల మేర నూతన మెట్రో మార్గాలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పుణె నగరంలో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Don’t receive OTP? Resend