అమరావతి: సస్పెండైన ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్‌పై వచ్చిన ఆర్థిక అవకతవకలు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఇవే ఆరోపణలపై ఆయన 2025 జనవరి నుంచి సస్పెన్షన్ లో కొనసాగుతున్నారు.
విచారణ అధికారిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సంజయ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల డీజీగా పనిచేసిన సమయంలో AGNI (Automated Governance & NoC Integration) వెబ్ పోర్టల్ రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన పనుల్లో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అదేవిధంగా సీఐడీ అదనపు డీజీగా పనిచేసిన సమయంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన బాధితుల హక్కులు, ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం-1989లోని నిబంధనలపై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించేందుకు కేటాయించిన నిధుల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఆరోపణలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం.. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనలు-1969లోని రూల్ 8(2) కింద సంజయ్‌పై మోపిన అభియోగాలపై రెగ్యులర్ విచారణ నిర్వహించాలని నిర్ణయించింది.
వివరణ ఇవ్వాలని ఆదేశించినా..
తనపై మోపిన ఆరోపణలకు సంబంధించి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ప్రభుత్వం సంజయ్‌ను ఆదేశించినప్పటికీ.. ఆయన నిర్దేశిత గడువులో తన రాతపూర్వక రక్షణ ప్రకటనను సమర్పించలేదని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
విచారణ అధికారిగా నియమితులైన కుమార్ విశ్వజీత్.. సంజయ్‌పై మోపిన అభియోగాలపై విచారణ జరిపి, నిర్దేశిత గడువులోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ చీఫ్‌గా..
ఎన్. సంజయ్ గతంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్‌గా పనిచేశారు. 2023లో అప్పటి టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ అరెస్టు చేసిన సమయంలో సంజయ్ సీఐడీ అధిపతిగా ఉన్నారు.
ప్రస్తుతం ఆయనపై నమోదైన ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, అధికారిక విధుల్లో అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం క్రమబద్ధమైన విచారణ చేపట్టనుంది. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Pattukelli mundara bokkalo vesi 3rd degree Ruchi chupinchandi vedhavaki.Jagan chemcha
Don’t receive OTP? Resend