58 ఏళ్ల వయసులో న్యూయార్క్‌లో తుదిశ్వాస.. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో పోరాటం.. ఇటీవలే పోలీసు సర్వీసు నుంచి పదవీ విరమణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1994 బ్యాచ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపీఎస్ఆర్టీసీ మాజీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బాలసుబ్రహ్మణ్యం (58) కన్నుమూశారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లారు. న్యూయార్క్‌లో చికిత్స పొందుతూ అక్టోబర్ 29 రాత్రి (భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 30) తుదిశ్వాస విడిచారు.
బాలసుబ్రహ్మణ్యం ఇటీవలే, 2026 ఆగస్టులో, సుదీర్ఘ పోలీసు సర్వీసు నుంచి పదవీ విరమణ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎస్పీగా కూడా పనిచేశారు.
రవాణా రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఏపీఎస్ఆర్టీసీలో కాగిత రహిత, నగదు రహిత సేవలను ప్రవేశపెట్టి ప్రయాణికులకు సేవలను మరింత సులభతరం చేసే ప్రయత్నం చేశారు. 2026 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది.
ఆయన మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, మాజీ డీజీపీ అంజనీ కుమార్ సహా పలువురు రాజకీయ, పోలీసు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
అమెరికా నుంచి ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
Don’t receive OTP? Resend