రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. ముంబయి సమీపంలోని కర్జాత్‌లో 100 ఎకరాల విస్తీర్ణంలో నీతా ముకేశ్ అంబానీ అనంత్ ఆశ్రయ్ పేరిట భారీ టౌన్‌షిప్‌ను ఆమె ప్రకటించారు. ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అనాథ పిల్లలు, వృద్ధులు, వైకల్యం ఉన్నవారు సహా 5,000 మందికి పైగా జీవితాంతం ఆశ్రయం కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని దశలవారీగా లాభాపేక్ష లేని సంస్థగా అభివృద్ధి చేయనున్నారు. నివాస గృహాలు, వైద్య సదుపాయాలు, పాఠశాలలు, పునరావాస కేంద్రాలతో పాటు విద్య, ఉపాధి, వినోదానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఇందులో కల్పించనున్నారు. ఈ కేంద్రం ద్వారా నివాసితులు, సంరక్షకులు, వైద్య నిపుణులు, సహాయక సిబ్బందితో కలిపి సుమారు 15,000 మందికి ప్రయోజనం చేకూరనుంది.
ఈ కేంద్రంలో భారతదేశంలోని పవిత్ర నదుల పేర్లతో 8 నివాస గ్రామాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గ్రామంలో చిన్న కుటుంబాల తరహా ఇళ్లు ఉంటాయి. హౌస్ పేరెంట్స్, సంరక్షకులు నివాసితులకు తోడుగా ఉంటూ సొంత ఇంటి అనుభూతిని కలిగిస్తారు. ప్రత్యేక ఆసుపత్రి, అధునాతన పునరావాస కేంద్రం ఇక్కడ ఏర్పాటవుతాయి. ఎపిలెప్సీ, ఎదుగుదల లోపాలు, ప్రత్యేక దంత చికిత్సలతో పాటు ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, హైడ్రోథెరపీ విభాగాలు అందుబాటులో ఉంటాయి. సంగీతం, లలిత కళలు, సృజనాత్మక నైపుణ్యాల కోసం ప్రత్యేక కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా దేవాలయం, ఉద్యానవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, ఆట స్థలాలు, శిక్షణా వర్క్‌షాప్‌లు, కేఫ్‌లు, క్రీడా, వినోద సదుపాయాలు ఉంటాయి. వంతారా నిపుణుల సహకారంతో జంతువులతో స్నేహం చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. బేకరీ, కేఫ్‌లు, హస్తకళల కేంద్రాల ద్వారా వృత్తి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఇక్కడి ఆసుపత్రి, కేఫ్‌ల వల్ల కర్జాత్ పరిసర గ్రామాల ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరనుండగా, సమీప ప్రాంతాల నుంచి 1,000 మందికి విద్య, ఉపాధి దక్కనుంది.
Don’t receive OTP? Resend