న్యూయార్క్: ముస్లింలను భారత్ నుంచి వెళ్లగొట్టాలని భావించే వ్యక్తి హిందువుగా కొనసాగలేడని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మానవులంతా ఒక్కటే అనే హిందూ భావనకు ఇతరులను మతం ఆధారంగా వెలివేసే ఆలోచనకు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు.
న్యూయార్క్లో AHEAD Forum నిర్వహించిన Faith Leaders Conferenceలో శనివారం భగవత్ మాట్లాడారు. క్రైస్తవ, యూదు, హిందూ, ఇస్లాం మతాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో భారత్లో మత సామరస్యం, వైవిధ్యం, సామాజిక ఐక్యత వంటి అంశాలపై ఆయన మాట్లాడారు.
‘ముస్లింలను వెళ్లగొట్టడం హిందుత్వం కాదు’
2018లో తాను నిర్వహించిన ఉపన్యాసాల సందర్భంగా కొందరు ముస్లిం సోదరులు అడిగిన ప్రశ్నను భగవత్ ప్రస్తావించారు.
‘‘హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను భారత్ నుంచి వెళ్లగొట్టడమేనా అని వారు అడిగారు. నేను కాదు అని చెప్పాను. అది హిందుత్వం కాదు. భారత్లో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువు భావించినా.. అతను హిందువుగా కొనసాగడు’’ అని ఆయన అన్నారు.
హిందువుగా చెప్పుకోవాలంటే అన్ని మార్గాలూ ఒకే భగవంతుడి వైపు దారితీస్తాయని, ప్రతి మనిషికి గౌరవం ఉంటుందని విశ్వసించాలని భగవత్ పేర్కొన్నారు.
‘‘మనుషుల మధ్య ఎలాంటి తేడా లేదు. ప్రతి మనిషికి గౌరవం ఉంది’’ అని అన్నారు.
‘వైవిధ్యం ప్రకృతి ధర్మం.. ఐక్యతే అంతర్లీన సత్యం’
హిందూ సంప్రదాయంలో అన్ని మతాలూ అంతిమంగా దైవత్వాన్వేషణ వైపే పయనిస్తాయన్న భావన ఉందని భగవత్ చెప్పారు. చరిత్రలో ఇతర ప్రాంతాల్లో భద్రత లభించని వివిధ మతాల ప్రజలకు భారత్ ఆశ్రయం కల్పించిందని గుర్తుచేశారు.
అయితే గతానికి సంబంధించిన కొన్ని ‘బ్యాగేజీ’ కారణంగా సమాజంలోని వివిధ వర్గాల మధ్య విభేదాలు, ఘర్షణలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు.
భిన్నత్వం వల్ల ఐక్యత దెబ్బతినదని ప్రజలకు వివరించడం ఆర్ఎస్ఎస్ బాధ్యతగా భావిస్తోందని చెప్పారు.
‘‘వైవిధ్యం మన అంతర్లీన ఐక్యతకు అలంకారం. దాన్ని కాపాడాలి. నా ప్రత్యేకతను నేను ఎలా కాపాడుకుంటానో, ఇతరుల ప్రత్యేకతను కూడా అలాగే కాపాడాలి. వైవిధ్యం ప్రకృతి ధర్మం. ప్రకృతి వెనుక ఉన్న సత్యం ఐక్యత’’ అని భగవత్ అన్నారు.
‘రాజకీయాల కంటే ముందుగా సమాజాన్ని మార్చాలి’
విధానాలను, రాజకీయాలను ప్రభావితం చేయాలన్న లక్ష్యం తమకు ఉందని భగవత్ చెప్పారు. యుద్ధాలను ఆపడం వంటి అంశాల్లోనూ సామాజిక ప్రభావం అవసరమని అన్నారు.
అయితే రాజకీయ వ్యవస్థ నుంచే ఈ మార్పును ప్రారంభించలేమని పేర్కొన్నారు.
‘‘రాజకీయాలు ఇప్పుడు స్వప్రయోజనాల ఆటగా మారాయి. ‘నేను, నాది’ అనే భావన ఉన్న చోట పరిష్కారం ఉండదు. ‘మనం, మనది’ అనే భావనే పరిష్కారం’’ అని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ప్రజాభిప్రాయంపై ఆధారపడి ఉంటాయని, అందువల్ల ముందుగా సమాజంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని వివరించారు.
‘సేవే సామాజిక నమ్మకానికి మరో మెట్టు’
2018 ఉపన్యాసాల తర్వాత ముస్లింలు, క్రైస్తవులతో తాము ప్రారంభించిన సంభాషణలను భగవత్ ప్రస్తావించారు.
‘‘సంభాషణ మొదటి అడుగు. సేవ మరో అడుగు’’ అని చెప్పారు.
1996లో హర్యానాలో జరిగిన సౌదియా, కజకిస్థాన్ ఎయిర్లైన్స్ విమానాల ఢీకొన్న ప్రమాదాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ప్రమాద స్థలానికి తొలుత చేరుకున్న వారిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారని, ప్రాణాలతో బయటపడిన వారికి సహాయం చేయడంతో పాటు మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించడంలోనూ వారు సహకరించారని తెలిపారు.
‘‘వారు ముస్లింలని మేం ఆలోచించలేదు. మేం రాజకీయాల్లో ఉండి ఉంటే అలా చేయలేకపోయేవాళ్లం’’ అని భగవత్ అన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఆర్ఎస్ఎస్ ప్రచారం కోరుకోదని చెప్పారు. సంస్థపై ఏర్పడిన కొన్ని అభిప్రాయాలు తప్పుడు కథనాల వల్లే వచ్చాయని, తమను అంతర్గతంగా చూసినప్పుడు ఆ అపోహలు తొలగిపోతాయని వ్యాఖ్యానించారు.
‘ప్రజాభిప్రాయం మారితే రాజకీయాలూ మారతాయి’
ముందుగా సామాజిక శక్తిని నిర్మించాలన్నదే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని భగవత్ చెప్పారు. బలమైన ప్రజాభిప్రాయం ఏర్పడితే అది చివరకు రాజకీయాలపై ప్రభావం చూపుతుందని అన్నారు.
‘‘ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ప్రజాభిప్రాయంపై ఆధారపడి ఉంటాయి. ఏదైనా అంశంపై ప్రజాభిప్రాయం బలంగా ఉంటే.. దానికి వ్యతిరేకంగా వెళ్లేందుకు ఏ రాజకీయ నాయకుడూ సాహసించడు’’ అని చెప్పారు.
వివిధ మతాలకు చెందిన ప్రజలను ఒకచోటికి తీసుకురావడం, వారి మధ్య అంతర్లీన ఐక్యతపై అవగాహన పెంచడం నిరంతర ప్రక్రియ అని భగవత్ పేర్కొన్నారు.
‘ఈ ప్రయత్నం నిరంతరం కొనసాగాలి’
మత పెద్దలు ఈ ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు. ఇది సుదీర్ఘమైన, శ్రమతో కూడిన ప్రక్రియ అని అంగీకరించారు.
‘‘ముస్లింలు, క్రైస్తవులు కొన్నిసార్లు నాతో మాట్లాడుతూ.. ఏడుసార్లు కూర్చొని మాట్లాడినా ఏమీ జరగలేదని చెబుతారు. నేను మాత్రం కొనసాగించండి.. ఏదో ఒక సమయంలో మార్పు వస్తుందని చెబుతాను’’ అని భగవత్ అన్నారు.
తమ ఉద్దేశం నిజమైనదైతే, తమలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని చెప్పారు. మానవులు చెడుల బారిన పడకుండా ఉండేందుకు వివిధ వర్గాల మధ్య సంభాషణ, అవగాహన ప్రక్రియ నిరంతరం కొనసాగాల్సిందే అని భగవత్ స్పష్టం చేశారు.
Don’t receive OTP? Resend