రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్ద ‘ఎయిడ్-డి-క్యాంప్’ (ఏడీసీ)గా సేవలు అందించిన మేజర్ రిషభ్ సింగ్ సాంబ్యాల్ 12 సంవత్సరాల మిలిటరీ కెరీర్ తర్వాత భారత సైన్యం నుంచి ముందస్తు పదవీ విరమణ తీసుకున్నారు. అధికారిక కార్యక్రమాలు, రాష్ట్రపతి పర్యటనల్లో నిరంతరం కనిపించే ఆయన నిర్ణయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. వ్యక్తిగత, కుటుంబ బాధ్యతల కారణాల వల్లనే ఆయన సైనిక విధుల నుంచి వైదొలిగినట్లు తెలిసింది.
విశిష్ట సైనిక ప్రస్థానం
32 ఏళ్ల వయస్సు ఉన్న మేజర్ రిషభ్ సింగ్ 2014లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ద్వారా భారత ఆర్మీలో చేరారు. మిలిటరీ స్టడీస్, డిఫెన్స్ మేనేజ్మెంట్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఆయన ‘4 పారా స్పెషల్ ఫోర్సెస్’లో పనిచేసి ప్రతిష్టాత్మకమైన ‘బలిదాన్ బ్యాడ్జ్’ సాధించారు. 2021 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కెప్టెన్ హోదాలో ‘జాట్ రెజిమెంట్’ దళానికి నాయకత్వం వహించిన రిషభ్, ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్ ట్రోఫీ సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు.
రాష్ట్రపతి భవన్లో విధులు
2023లో మేజర్ రిషభ్ సింగ్ రాష్ట్రపతి ఏడీసీగా ఎంపికయ్యారు. రాష్ట్రపతి భవన్లో ప్రొటోకాల్‌ను అనుసరించి భద్రతా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడమే కాకుండా, తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆర్మీ నుంచి ముందస్తు విరమణపై రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఏ ప్రకటన విడుదల చేయనప్పటికీ, ఆయన నిర్ణయం సైనిక వర్గాల్లోనూ చర్చగా మారింది.
Don’t receive OTP? Resend