మంగళగిరి: మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇందులో భాగంగా మంగళగిరి పట్టణంలోని నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో నిర్మించనున్న మోడ్రన్ రైతు బజార్‌కు గురువారం ఆయన భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకున్న లోకేష్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రైతు బజార్ నమూనా చిత్రాలను పరిశీలించిన మంత్రి.. నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
5.90 ఎకరాల్లో భారీ మార్కెట్
మంగళగిరి ప్రజలు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. 5.90 ఎకరాల విస్తీర్ణంలో రూ.18.55 కోట్ల అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులతో మార్కెట్‌ను నిర్మించనున్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 71,925 చదరపు అడుగులు.
మార్కెట్లో రిటైల్, హోల్‌సేల్ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. రిటైల్ మార్కెట్లో కూరగాయల విక్రయాలకు 102 స్టాళ్లు, పండ్లు, పూల విక్రయాలకు 54 ప్రత్యేక స్టాళ్లు అందుబాటులో ఉంటాయి. ఇతర వస్తువుల విక్రయాల కోసం మరో 60 షాపులు ఏర్పాటు చేయనున్నారు.
హోల్‌సేల్ మార్కెట్లో సరుకుల అన్లోడింగ్ కోసం 18 ప్లాట్‌ఫామ్‌లు, కూరగాయల విక్రయాలకు 23 షాపులు నిర్మించనున్నారు. మార్కెట్లో కోల్డ్ స్టోరేజీ, కూరగాయలు కడిగే ప్రాంతాలు, పరిపాలన, నిర్వహణ విభాగాలు, క్యాంటీన్, మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తారు.
వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక సదుపాయం
వినియోగదారులకు, వ్యాపారులకు సౌకర్యంగా ఉండేలా మార్కెట్‌ను ఆధునిక ప్రమాణాలతో నిర్మించనున్నారు. పరిశుభ్రత, పర్యావరణహిత వాతావరణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సరుకుల రవాణా వాహనాలతో పాటు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ జీ. భీముడు, ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీమ్ బాషా, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గుత్తికొండ ధనుంజయరావు, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Don’t receive OTP? Resend