నెతన్యాహు కూటమికి 53 స్థానాలు.. గాడి ఐసెన్కాట్ నేతృత్వంలోని ప్రతిపక్షానికి 48 సీట్లు.. 19 స్థానాలతో కీలకంగా మారిన అరబ్ పార్టీలు
జెరూసలేం: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ 27న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు.
ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి 53 స్థానాలు, మాజీ సైన్యాధిపతి గాడి ఐసెన్కాట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 48 స్థానాలు దక్కాయి. 120 మంది సభ్యులున్న నెస్సెట్ (ఇజ్రాయెల్ పార్లమెంటు)లో ప్రభుత్వ ఏర్పాటుకు 61 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటులో అరబ్ పార్టీల పాత్ర కీలకంగా మారింది.
ఈ ఎన్నికలను నెతన్యాహు నాయకత్వానికి ప్రజల మద్దతుపై ప్రజాభిప్రాయ సేకరణగా ప్రతిపక్షం అభివర్ణించింది. గాజాపై యుద్ధం, ఇరాన్‌పై సైనిక దాడులు, పాలస్తీనియన్ల విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరి ఎన్నికల ప్రచారంలో ప్రధాన చర్చనీయాంశాలయ్యాయి. నెతన్యాహును అధికారానికి దూరం చేయాలని ఐసెన్కాట్ నేతృత్వంలోని ప్రతిపక్షం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఎన్నికల ఫలితాలు ఇజ్రాయెల్‌లో రాజకీయ విభజనను మరోసారి స్పష్టం చేశాయి.
నెతన్యాహు పార్టీదే అతిపెద్ద స్థానం
నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ 27 స్థానాలు గెలుచుకుని పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే, నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో సాధించిన 32 స్థానాలతో పోలిస్తే ఐదు సీట్లు తగ్గాయి. ఆయన కూటమిలోని అతివాద పార్టీలైన ఇతామర్ బెన్-గ్విర్ నేతృత్వంలోని ఒట్జ్మా యెహుదిత్కు ఏడు, బెజలెల్ స్మోట్రిచ్ నేతృత్వంలోని రిలీజియస్ జియోనిజానికి ఆరు స్థానాలు లభించాయి.
మతపరమైన పార్టీలైన షాస్, యునైటెడ్ తోరా జుడాయిజం చెరో ఏడు స్థానాలు సాధించాయి. మొత్తంగా నెతన్యాహు కూటమి బలం 53కు చేరింది. గత పార్లమెంటులో ఈ కూటమికి 68 స్థానాలు ఉండగా, ఇప్పుడు 15 సీట్లు తగ్గాయి. అయినప్పటికీ లికుడ్ అతిపెద్ద పార్టీగా నిలవడం, నెతన్యాహు కూటమి ప్రతిపక్షం కంటే ఎక్కువ స్థానాలు సాధించడం ఆయనకు రాజకీయంగా కొంత వెసులుబాటు కల్పించాయి.
ఐసెన్కాట్ కూటమికి 48 సీట్లు
మాజీ సైన్యాధిపతి గాడి ఐసెన్కాట్ నేతృత్వంలోని యషార్ పార్టీ 21 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఎన్నికలకు ముందు లికుడ్ను అధిగమిస్తుందని అంచనాలు వెలువడినప్పటికీ, ఆ స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది.
ఐసెన్కాట్కు మద్దతుగా ఉన్న నఫ్తాలి బెన్నెట్ నేతృత్వంలోని బియాచాద్ పార్టీకి 12, డెమోక్రాట్స్‌కు ఎనిమిది, అవిగ్డోర్ లీబర్మన్ నేతృత్వంలోని ఇజ్రాయెల్ బెటెనుకు ఏడు స్థానాలు లభించాయి. దీంతో ప్రతిపక్ష కూటమి మొత్తం బలం 48కు చేరింది. మెజారిటీకి ఇంకా 13 స్థానాలు అవసరం.
అరబ్ పార్టీలకు రికార్డు స్థాయిలో సీట్లు
ఈ ఎన్నికల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం అరబ్ పార్టీల బలం పెరగడం. జాయింట్ లిస్ట్ 11 స్థానాలు, యునైటెడ్ అరబ్ లిస్ట్ (రామ్) ఎనిమిది స్థానాలు సాధించాయి. ఈ రెండు పార్టీలకు కలిపి 19 సీట్లు లభించాయి. ఇజ్రాయెల్ పార్లమెంటులో అరబ్ పార్టీలకు దక్కిన అత్యధిక స్థానాల సంఖ్య ఇదే.
ఈ 19 మంది సభ్యుల మద్దతు ప్రతిపక్ష కూటమికి లభిస్తే మెజారిటీకి అవసరమైన సంఖ్యను చేరుకోవచ్చు. అయితే, ఐసెన్కాట్ కూటమిలోని కొన్ని పార్టీలు అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో వారి మద్దతు ఉన్నప్పటికీ ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రాజకీయంగా సులభం కాకపోవచ్చు.
ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ
ప్రస్తుత ఫలితాలు నెతన్యాహుకు మరోసారి అధికారం దక్కే అవకాశాన్ని పూర్తిగా మూసివేయలేదు. అదే సమయంలో ప్రతిపక్షం కూడా అరబ్ పార్టీల మద్దతు లేదా ఇతర పార్టీలతో రాజకీయ అవగాహన ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించవచ్చు. రెండు ప్రధాన కూటముల మధ్య చర్చలు, రాజీలు కీలకం కానున్నాయి.
నెతన్యాహు ప్రత్యర్థులను తన కూటమిలోకి ఆహ్వానించే అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అలాంటి ప్రయత్నాలు విఫలమైతే మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. తుది ఫలితాల ధ్రువీకరణతో పాటు ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ చర్చలు ఇజ్రాయెల్‌లో రాబోయే రోజుల్లో కీలకంగా మారనున్నాయి.
Don’t receive OTP? Resend