అర్మేనియా పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. నేషనల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార సివిల్ కాంట్రాక్ట్ పార్టీ, ప్రతిపక్ష స్ట్రాంగ్ అర్మేనియా కూటమికి చెందిన ఎంపీల మధ్య మొదలైన మాటల యుద్ధం క్రమంగా పెద్దఎత్తున కొట్లాటకు దారితీసింది.
సభ్యులు చట్టసభ హాల్లోనే ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ కాళ్లతో తన్నుకోవడం కనిపించింది. అధికార పార్టీ ఎంపీ టారోన్ చఖోయన్ ప్రసంగిస్తూ ప్రతిపక్ష సభ్యులు, మాజీ అధ్యక్షుడు రాబర్ట్ కోచార్యన్ అనుచరులపై అవినీతి ఆరోపణలు చేయడంతో ఈ వివాదం రాజుకుంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత నరేక్ కరపెట్యాన్ తీవ్రంగా స్పందించడంతో వాగ్వాదం కాస్తా తోపులాటగా, భౌతిక దాడికి మారింది.
పార్లమెంటు హాల్లో ప్రారంభమైన ఈ ఘర్షణ ఆ తర్వాత కారిడార్లోకి కూడా విస్తరించినట్లు సమాచారం. అయితే ఈ ఊహించని దృశ్యాలన్నీ పార్లమెంటు అధికారిక ఛానెల్ ద్వారా లైవ్లో ప్రసారం కావడం గమనార్హం. సభలో జరుగుతున్న పరిణామాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో స్పీకర్ రూబెన్ రుబిన్యన్ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేయబోనని స్పష్టం చేయడం విశేషం.
Don’t receive OTP? Resend