ఐపీఎస్ ఉదయ్ రిమాండ్ రిపోర్టులో సంచలనాలు
హైదరాబాద్: ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ములగాని ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పలు సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలకు అనుగుణంగా భౌతిక, డిజిటల్, వైద్య ఆధారాలను పోలీసులు సేకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బుధవారం ఉప్పరపల్లి కోర్టు ఉదయ్ కృష్ణారెడ్డికి ఆగస్టు 11 వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
జూన్ 23 నుంచి వేధింపులు
రిమాండ్ రిపోర్టు ప్రకారం, జూన్ 23 నుంచి నిందితుడు బాధిత ట్రైనీ ఐపీఎస్ అధికారిని నిరంతరం వేధించడం ప్రారంభించాడు. అసభ్యకరమైన వాట్సాప్ సందేశాలు పంపడం, తోటి ట్రైనీల ఎదుట అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేయడం ద్వారా మానసికంగా వేధించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఫోన్ లాక్కొని పాస్వర్డ్ చెప్పించాడన్న ఆరోపణ
జూలై 8న బాధితురాలి మొబైల్ ఫోన్‌ను బలవంతంగా తీసుకుని తన గదికి తీసుకెళ్లాడని, ఫోన్ పాస్‌వర్డ్‌ను చెప్పాలని ఒత్తిడి చేశాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అనంతరం ఆమె వ్యక్తిగత సమాచారాన్ని పరిశీలించినట్లు పోలీసులు ఆరోపించారు. అలాగే ఆమె వ్యక్తిగత వీడియోను రహస్యంగా రికార్డు చేసి, దానిని ఆమె భర్తకు పంపి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు కేసులో నమోదు చేశారు.
గదిలో నిర్బంధం.. గొంతు నులిమే ప్రయత్నం
జూలై 9 రాత్రి బాధితురాలిని బలవంతంగా తన గదికి తీసుకెళ్లి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నట్లు రిమాండ్ రిపోర్టు పేర్కొంది. ఆమె జుట్టు పట్టుకుని లాగడంతో పాటు గొంతు నులిమే ప్రయత్నం చేశాడని, కత్తితో బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో ఆమెను లైంగికంగా వేధించేందుకు కూడా ప్రయత్నించినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు.
వైద్య పరీక్షల్లో గాయాల గుర్తింపు
దర్యాప్తులో భాగంగా బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమె మెడపై గాయాల గుర్తులు, చెంపపై దెబ్బల ఆనవాళ్లు, ఎడమ కాలిపై గాయాలు ఉన్నట్లు మెడికల్ నివేదికలో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ గాయాలు ఫిర్యాదులో పేర్కొన్న ఘటనలకు అనుగుణంగా ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
డిజిటల్ ఆధారాల సేకరణ
వాట్సాప్ చాట్లు, మొబైల్ ఫోన్ డేటా, వీడియోలు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం వాటిని పంపినట్లు కూడా పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని డిజిటల్, డాక్యుమెంటరీ ఆధారాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS)లో మహిళలపై నేరాలు, బెదిరింపులు, అక్రమ నిర్బంధం తదితర సెక్షన్లతో పాటు సమాచార సాంకేతిక చట్టంలోని సంబంధిత నిబంధనల కింద అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తును ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేశారు.
14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
మంగళవారం సాయంత్రం మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న ఉదయ్ కృష్ణారెడ్డిని బుధవారం అధికారికంగా అరెస్టు చేసి వైద్య పరీక్షల అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఆగస్టు 11 వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. ఇదిలా ఉండగా, ఉదయ్ కృష్ణారెడ్డి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆరోపణలు పరస్పర సమ్మతితో ఉన్న సంబంధం తరువాత తలెత్తిన వివాదం ఫలితమని తన పిటిషన్లో పేర్కొన్నారు.
Login
Comments (0)