ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వీడియో నిఘా కెమెరాల కళ్లు గప్పి తిరిగేందుకు జర్మనీకి చెందిన డిజైనర్ సైమన్ వెకెర్ట్ ఒక వినూత్న మార్గాన్ని కనుగొన్నారు. ఏఐ కెమెరాలను తికమక పెట్టేలా ఆయన ఒక ప్రత్యేకమైన 'డిజిటల్ కామోఫ్లాజ్' చొక్కాను డిజైన్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు అమర్చే ఏఐ కెమెరా వ్యవస్థలోని సాంకేతిక లోపాలను బహిర్గతం చేయడమే లక్ష్యంగా ఆయన ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
ఏఐ కెమెరా పనితీరును దెబ్బతీసే డిజైన్
సాధారణంగా ఏఐ కెమెరా సిస్టమ్స్ లక్షలాది మనుషుల చిత్రాల ఆధారంగా శిక్షణ పొందుతాయి. మనుషుల శరీరాకృతి, రంగులు, అవుట్‌లైన్ ఆధారంగా కెమెరా ముందర నడుస్తున్న వారిని గుర్తించి పర్సన్ అని లేబుల్ చేస్తాయి. అయితే సైమన్ రూపొందించిన డిజిటల్ కామోఫ్లాజ్ చొక్కాపై ఉండే ప్రకాశవంతమైన రంగులు, ఒకదానిలో ఒకటి కలిసిపోయే ఆకారాలు ఏఐ అల్గారిథమ్‌ను అయోమయానికి గురిచేస్తాయి. దీనివల్ల కెమెరా ముందు మనిషి ఉన్నప్పటికీ ఆకారాన్ని కచ్చితంగా అంచనా వేయలేక డిటెక్షన్ వ్యవస్థ విఫలమవుతుంది.
సాంకేతిక పరిమితులపై నిరసన
బెర్లిన్ సహా పలు ప్రధాన నగరాల్లోని వీధుల్లో ఈ చొక్కాను ధరించి నడుస్తున్న దృశ్యాలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. చొక్కా ధరించిన వ్యక్తి మినహా చుట్టుపక్కల ఉన్న మిగతా అందరినీ కెమెరా గుర్తించడం విశేషం. మనుషులు చూసి అర్థం చేసుకునే రీతికి, ఏఐ విజన్ టెక్నాలజీ విశ్లేషించే విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపడానికే తాను ఈ కామోఫ్లాజ్ చొక్కాను తయారు చేసినట్లు సైమన్ వెకెర్ట్ స్పష్టం చేశారు.
Don’t receive OTP? Resend