ఆంధ్రప్రదేశ్ లో తుపాను ముప్పు మరోసారి పొంచివుంది. అర్నబ్ తుపాను నష్టం నుంచి రాష్ట్రం ఇంకా కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం తాజాగా వాయుగుండంగా బలపడింది.
ప్రస్తుతం ఆయా సముద్ర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం రానున్న పన్నెండు గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు సాయంత్రానికి ఇది తుపానుగా రూపాంతరం చెంది, ఎల్లుండి సాయంత్రానికి తీర ప్రాంతానికి చేరుకునే సూచనలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
సముద్రంలో వాతావరణం పూర్తిగా అనుకూలంగా లేకపోవడం, తుపాను ముప్పు పెరుగుతుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికార వర్గాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తదనుగుణంగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Don’t receive OTP? Resend