అర్నబ్ అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగరం అతలాకుతలమైంది. మంగళవారం నిరంతరాయంగా కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రచండ గాలులకు వందలాది వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకూలడంతో నగరంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం వచ్చిన హుద్‌హుద్ తుపాను భీకర పరిస్థితులను తలపించేలా అర్నబ్ తుపాను విశాఖను వణికించింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడటంతో పాటు ఈదురుగాలులు వీచాయి. సాగరం ఉప్పొంగి తీరంలో అలలు ఎగసిపడ్డాయి. బీచ్ రోడ్డుతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ చెట్లు విరిగిపడటంతో కీలక మార్గాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్తు స్తంభాలు నేలకూలడంతో చాలా ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి. సిగ్నల్స్ లేక మొబైల్ నెట్వర్క్ వ్యవస్థ కూడా దెబ్బతిన్నది.
జిల్లావ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్యధికంగా పెందుర్తిలోని నేతాజీపార్క్ ఏరియాలో 14.9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. సింహాచలంలో 14.4, బుచ్చిరాజపాలెంలో 14.2, మధురవాడ, మహారాణిపేటలో 13.8 సెం.మీ చొప్పున వర్షం పడింది. జిల్లాలో సరాసరిన 119 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. పాత గాజువాక ప్రధాన రోడ్డు, మేహాద్రిపేట కాలనీ, సిరిపురం తదితర లోతట్టు ప్రాంతాలు మోకాలు లోతు నీట మునిగాయి. ఎంవీపీ కాలనీలో పార్క్ చేసిన కార్లపై చెట్లు పడటంతో వాహనాలు దెబ్బతిన్నాయి. యారాడ తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో పర్యాటకులు వెళ్లకుండా పోలీసులు, లైఫ్ గార్డులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. బుధవారం కూడా భారీ వర్షాలుంటాయని నిపుణులు హెచ్చరించడంతో నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Don’t receive OTP? Resend