మహిళా ఎస్ఐ ఘటన.. పరారీలో చింతాడ రవికుమార్
శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా మహిళా ఎస్సై ప్రవల్లికపై దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమదాలవలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పరారయ్యారు.
పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఇదే సమయంలో ఓ వీడియో విడుదల చేసిన రవికుమార్ తనపై నమోదైన కేసులు నిరాధారమని పేర్కొంటూ వివరణ ఇచ్చారు.
వీడియోలో ఏమన్నారంటే..
మహిళా ఎస్సై ప్రవల్లిక తన నియోజకవర్గంలోనే విధులు నిర్వహిస్తున్నారని, ఇటీవల ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారని రవికుమార్ వీడియోలో చెప్పారు. అందుకే "మీ ఆరోగ్యం బాగోలేదు.. ఇక్కడ జనాలు ఎక్కువగా వస్తున్నారు.. మీరు పక్కకు వెళ్లండి" అని చెప్పేందుకు మాత్రమే ఆమె వద్దకు వెళ్లానని తెలిపారు.
"మేము ఆమెను పక్కకు తీసుకెళ్తుండగా అక్కడ ఉన్న కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ శబ్దంతో ఆమె చెవులు మూసుకున్నారు. జరిగినది అంతే. కానీ మాపై హత్యాయత్నం, మహిళా పోలీసుపై దాడి, విధుల్లో ఉన్న అధికారిని అడ్డుకోవడం, కుట్ర వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు" అని ఆయన ఆరోపించారు.
ప్రకటనకు ముందే పరారీ
ఈ ఘటనలో చింతాడ రవికుమార్‌తో పాటు మరో 20 మందిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన విషయాన్ని పోలీసులు అధికారికంగా శుక్రవారం సాయంత్రం వెల్లడించగా, అంతకుముందే శుక్రవారం ఉదయం రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది.
'పోలీసుల్లో కోవర్టులు ఉన్నారు'
ఈ వ్యవహారంపై ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. మహిళా ఎస్సైపై దాడి జరిగిన తర్వాత 24 గంటలు గడిచినా నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
"పోలీసుల అధికారిక వెబ్సైట్లో కేసు నమోదు చేసిన వివరాలు లేకపోయినా, చింతాడ రవికుమార్‌కు మాత్రం ఉదయాన్నే తనపై ఏయే సెక్షన్లు నమోదు చేశారో ఎలా తెలిసింది? జిల్లా ఎస్పీ కార్యాలయంలోనే వైసీపీ కోవర్టులు ఉన్నారనేందుకు ఇదే నిదర్శనం" అని ఆరోపించారు.
21 మందిపై కేసు
మహిళా ఎస్సై ప్రవల్లికపై దౌర్జన్య ఘటనలో చింతాడ రవికుమార్‌తో పాటు మొత్తం 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం, మహిళపై దాడి, కుట్ర, ఇతర సంబంధిత నేరాల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిసింది.
నిందితుల్లో పలువురికి నేరచరిత్ర
ఈ కేసులో నిందితులుగా ఉన్న కొందరిపై గతంలోనూ క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.
ఏ2 బొడ్డేపల్లి శ్రీనుపై గతంలో పలాసకు చెందిన ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసు నమోదైంది.
ఏ4 అన్నెపు కృష్ణపై ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు ఉంది.
మరో నిందితుడిపై 2024లో ఆస్తుల ధ్వంసం కేసు ఉండగా, ఇంకొకరిపై కొట్లాట కేసు నమోదైనట్లు సమాచారం.
ఎస్సై ప్రవల్లికను పరామర్శించిన ఎమ్మెల్యే గౌతు శిరీష
మహిళా ఎస్సై ప్రవల్లికను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం బూర్జ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పరామర్శించారు. జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకుని, విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారిపై దాడిని తీవ్రంగా ఖండించారు.
Login
Comments (0)