ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. చిన్న తరహా వ్యాపారాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచి వారి కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కాఫీ, టీ సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది.
ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నేటివ్ అరకు కాఫీ, చాయ్ రాస్తా, గాటోస్ కేఫ్ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఐదు చొప్పున మొత్తం 140 సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సెర్ప్ అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
వివిధ మోడళ్లు మరియు వ్యయం
డ్వాక్రా మహిళలకు అనుకూలంగా ఉండేలా వివిధ నమూనాల్లో ఈ సెంటర్లను రూపకల్పన చేశారు. నేటివ్ అరకు కాఫీ సంస్థ కంటెయినర్ మోడల్, వర్కింగ్ మోడల్, కరెంట్ మోడల్ పేరుతో తయారు చేసిన కేఫ్ ల నిర్మాణం రూ.3.9 లక్షల నుంచి రూ.5.9 లక్షల వరకు అవుతుంది. గాటోస్ కాఫీ సంస్థ రూ.5 లక్షల అంచనాతో సెంటర్లను ప్రతిపాదించగా, చాయ్ రాస్తా సంస్థ రూ.3.9 లక్షల నుంచి రూ.6.7 లక్షల వరకు వ్యయమయ్యే నాలుగు రకాల కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 37 ప్రాంతాల్లో నేటివ్ అరకు కాఫీ సెంటర్లు అందుబాటులోకి రాగా, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో గాటోస్ కేఫ్ సెంటర్లు ప్రారంభమయ్యాయి.
35 శాతం రాయితీ మరియు బ్యాంకు రుణాలు
ఈ కేఫ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే డ్వాక్రా మహిళలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం పీఎంఈజీపీ పథకాన్ని అనుసంధానిస్తోంది. దీనిద్వారా ప్రాసెసింగ్ పరికరాల ఏర్పాటుకు 35 శాతం వరకు రాయితీ అందిస్తోంది. అవసరమైన మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో మంజూరు చేయిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితో ఆయా సంస్థలు రాయల్టీని కూడా మినహాయించాయి. ప్రస్తుతం ఈ సెంటర్లు నిర్వహిస్తున్న మహిళలు నెలకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు.
Don’t receive OTP? Resend