ఎల్నినో ప్రభావంతో సింగూరు జలాశయంలో నీటిమట్టం క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో తెలంగాణలో బల్క్ తాగునీటి సరఫరాను రోజు విడిచి రోజు అందించాలని నిర్ణయించినట్లు బాన్సువాడ మిషన్ భగీరథ గ్రిడ్ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎస్. స్వప్న వెల్లడించారు. ఈ మేరకు ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలో నీటి సరఫరా వేళల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు, 29న బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాలకు బల్క్ నీటిని సరఫరా చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుత ఎండాకాలం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ తాగునీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, నీటి వృథాను పూర్తిగా అరికట్టాలని ఈఈ స్వప్న విజ్ఞప్తి చేశారు. జలాశయంలో నీటి లభ్యతను బట్టి సరఫరా కొనసాగుతుందని, ప్రజలు తమ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ నీటి వనరులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. తాగునీటి ఎద్దడిని సమర్థంగా అధిగమించడానికి స్థానిక ప్రజలందరూ యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు.
Don’t receive OTP? Resend