బెంగళూరులోని యలహంక ప్యాలెస్ పూర్తిగా తన పిల్లల హక్కు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తన కుమార్తె వివాహ వేదికపై జరుగుతున్న వివాదాలు, పరిణామాల నేపథ్యంలో ఆమె సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన విడుదల చేశారు. ఆస్తుల పంపకాల విషయంలో స్పష్టతనిస్తూ, యలహంక ఆస్తి వందశాతం తనకు, తన పిల్లలకు దక్కిందనేది దేవుడి సాక్షిగా నిజమని ఆమె పేర్కొన్నారు.
తన తండ్రి సంచరించిన ఇల్లు కావడంతో అక్కడే కుమార్తె వివాహం జరిపించాలని కోరుకున్నట్లు షర్మిల తెలిపారు. సొంత ఇంట్లో పెళ్లి చేయడం తల్లిదండ్రుల అదృష్టమని భావించినప్పటికీ, ప్రస్తుత వివాదాల దృష్ట్యా ఆ కోరిక నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె అంజలి వివాహం ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా జరిపించాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో యలహంక ఇంట్లో కాకుండా మరోచోట వివాహం నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు.
ఎవరికీ చెందని దానిపై ఆశపడే నీచత్వం తనది కాదని షర్మిల స్పష్టం చేశారు. తన సోదరుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు యలహంక ఆస్తి ఉమ్మడిగానే ఉందన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆస్తుల విభజన ప్రక్రియలో భాగంగా యలహంక ప్రాపర్టీ తమ వాటాలోకి వచ్చిందని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆమె ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
Don’t receive OTP? Resend