హిందూపురంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మున్సిపల్ ఛైర్మన్, వార్డు అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ఆయన హిందూపురం చేరుకున్నారు.
పట్టణానికి చెందిన ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన బాలకృష్ణ పలు అంశాలపై చర్చించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత రెండున్నర సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించే పూర్తి శక్తి కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు.
గత మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా నేతలు చేసిన దౌర్జన్యాలను పట్టణ ప్రజలు ఇంకా మర్చిపోలేదని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ అత్యంత శాంతియుతంగా జరుగుతోందని, ప్రజలందరూ ఈ మార్పును గమనిస్తున్నారని చెప్పారు. హిందూపురంలో కొత్త కౌన్సిల్ ఏర్పాటైన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలను మరింత జోరుగా ముందుకు తీసుకెళ్లి పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Don’t receive OTP? Resend