విజయ్, త్రిషపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం ఉదయం చెన్నైలోని నీలాంకరై నివాసంలో అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్, ప్రముఖ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఈ చర్య తీసుకున్నారు.
కొద్ది రోజుల క్రితం తంజావూరులో కావేరీ జలాల అంశంపై జరిగిన నిరసన సభలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు "త్రిష.. త్రిష" అంటూ నినాదాలు చేశారు. దీనికి స్పందిస్తూ ఆయన చేసిన ద్వంద్వార్థ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని ఆరోపిస్తూ అధికార తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తంజావూరు మహిళా విభాగం నేత ఎస్. భైరవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఉదయనిధిపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్ (NCW)ను కూడా ఆశ్రయించింది. ఒక మహిళా నటిని రాజకీయ వివాదంలోకి లాగి ఆమె గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది.
ఉదయనిధి అరెస్ట్ వార్తతో డీఎంకే కార్యకర్తలు ఆయన నివాసానికి భారీగా చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
మరోవైపు, ఉదయనిధి స్టాలిన్ తరఫు న్యాయవాదులు మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపగా, అధికార టీవీకే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రం అయ్యాయి.
Login
Comments (0)