కీలక అంశాలపై మరింత దర్యాప్తు చేయాలని రాష్ట్రపతికి లేఖ.. హత్య సమాచారం జగన్కు ముందే ఎలా తెలిసిందో విచారించాలని డిమాండ్
పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏడున్నరేళ్లు గడిచినా పూర్తి న్యాయం జరగలేదని ఆయన కుమార్తె వైఎస్ సునీత మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా శనివారం పులివెందులలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సునీత, కేసులో ఇంకా అనేక కీలక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఆమె లేఖ రాశారు.
జగన్కు సమాచారం ఎలా చేరింది?
"మా నాన్న మరణవార్త జగనన్నకు అందరికంటే ముందే తెల్లవారుజామున 5.30 గంటలకే ఎలా తెలిసింది? దీనిపై సీబీఐ, కోర్టును విచారణ చేయాలని కోరాం. కుటుంబ సభ్యులు కాబట్టి తెలిసి ఉండొచ్చని చెప్పి ఆ అంశాన్ని దాటవేశారు. కానీ ఆ కోణంలో లోతుగా దర్యాప్తు జరగలేదు" అని సునీత వ్యాఖ్యానించారు.
ఇంకా ఛేదించని అంశాలే ఎక్కువ
హత్యకు ఉపయోగించిన ఆయుధం ఇప్పటికీ దొరకలేదని, నగదు లావాదేవీలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగలేదని సునీత తెలిపారు. హత్య వెనుక ఉన్న విస్తృత నేరపూరిత కుట్ర, హత్య సమాచారం తొలుత ఎలా బయటకు వెళ్లింది వంటి అంశాలపై మరింత దర్యాప్తు అవసరమన్నారు. ఈ అంశాలన్నింటినీ తన లేఖలో రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
రాష్ట్రపతికి విజ్ఞప్తి
దర్యాప్తు లేదా న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని తన ఉద్దేశం కాదని స్పష్టం చేసిన సునీత, మిగిలిన కీలక అంశాలను పూర్తిస్థాయిలో విచారించేలా సంబంధిత అధికారులకు సూచించాలని రాష్ట్రపతిని కోరారు. ప్రజల్లో దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థపై విశ్వాసం నిలిచేలా నిజానిజాలను పూర్తిగా వెలికితీయాల్సిన అవసరం ఉందన్నారు.
కేసు దర్యాప్తు నేపథ్యం
వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. తొలుత అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును తర్వాత హత్య, నేరపూరిత కుట్ర కేసుగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సునీత హైకోర్టును ఆశ్రయించగా, కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు వెలువడ్డాయి. 2020 జూలై 9న సీబీఐ కేసు నమోదు చేసింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది.
'గ్రే ఏరియాలు'పై మరింత విచారణ కోరుతూ
దర్యాప్తులో కొన్ని "గ్రే ఏరియాలు" ఇంకా పూర్తిగా పరిశీలించాల్సి ఉందని సీబీఐ కోర్టే పేర్కొన్న విషయాన్ని సునీత ప్రస్తావించారు. ఈ అంశాలపై మరింత దర్యాప్తు కోరుతూ తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, ఎంపీగా సేవలందించిన వివేకానందరెడ్డి హత్య కేసులో పూర్తి నిజాలు బయటపడటం ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని బలోపేతం చేస్తుందని ఆమె పేర్కొన్నారు.
Don’t receive OTP? Resend