తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ నోటీసుల జాబితాలోని 76 శాతం ఓటర్లు తుది జాబితాకు అర్హత పొంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం అధికారిక వివరాలను వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి వరకు 91,92,625 మందికి అధికారులు నోటీసులు ఇవ్వగా, వారిలో 71,23,526 మంది సరైన ధ్రువపత్రాలు సమర్పించి తుది జాబితాకు అర్హత సాధించారు. మిగతా సుమారు 20 లక్షల మంది ఓటర్ల విచారణ జరగాల్సి ఉంది. అలాగే ఇంకా 95,555 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాకముందు రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 ఓటర్లు ఉండగా, అందులో 2,43,23,162 ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు నింపి ఇచ్చారు. ఎన్యుమరేషన్ దశలోనే సుమారు 73.39 లక్షల ఓట్లు తొలగిపోయాయి. నవంబరు 5 వరకు నోటీసులు జారీ, విచారణ ప్రక్రియ నిరంతరం కొనసాగనుంది. ఇప్పటివరకు మొత్తం 2,43,23,162 మంది ఓటర్లు తుది జాబితాకు అర్హత సాధించినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
Don’t receive OTP? Resend