అర్నబ్ అతి తీవ్ర తుపాను యానాంకు దక్షిణంగా నరసాపురం సమీపంలో తీరంలోకి ప్రవేశించిందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను పూర్తిగా తీరం దాటేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలినట్లు పేర్కొన్నారు.
ఈ తీవ్ర తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలపై ఈ ప్రభావం అత్యధికంగా కనిపిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
కోనసీమ ప్రాంతంలో తీవ్రమైన ఈదురుగాలులకు కొబ్బరిచెట్లు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాకినాడ జిల్లా కాజులూరులో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో ప్రధాన రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పాడలో సముద్రపు అలల ఉద్ధృతికి బీచ్ రోడ్డు ధ్వంసమైంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుతో పాటు యానాంలోనూ భారీ వర్షాలు కురిసి, వరి పంటలు నీట మునిగాయి.
Don’t receive OTP? Resend