ప్రైమరీ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూల సందడి ఈ వారం కూడా కొనసాగనుంది. వివిధ రంగాలకు చెందిన ఐదు కంపెనీలు దాదాపు రూ.2,600 కోట్ల నిధులను మార్కెట్ నుంచి సమీకరించేందుకు సిద్ధమయ్యాయి. కార్పొరేట్ అవసరాలు, రుణాల చెల్లింపుల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ వారంలో రానున్న వివిధ ఐపీఓల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన ఈఏఏఏ ఇండియా ఆల్టర్నేటివ్స్ రూ.1,200 కోట్ల నిధుల సమీకరణతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. అక్టోబర్ 26న ప్రారంభమయ్యే ఈ సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 28న ముగియనుంది. ఒక్కో షేరు ధర రూ.1,585-1,665గా కంపెనీ నిర్ణయించింది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో షేర్లను విక్రయిస్తుండగా, యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటికే రూ.360 కోట్లు సమీకరించింది.
వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎస్ఎఫ్సీ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్ రూ.668 కోట్ల నిధులతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. అక్టోబర్ 27 నుంచి 29 వరకు సబ్స్క్రిప్షన్ కొనసాగనుంది. ధరల శ్రేణి రూ.313-330గా ఉంది. రూ.150 కోట్ల విలువైన తాజా షేర్లు, 1.57 కోట్ల ఆఫర్ ఫర్ సేల్‌ను విక్రయించనున్నారు. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద కంపెనీ మార్కెట్ విలువ రూ.3,233 కోట్లుగా ఉంది.
ఎంకే సన్స్ ఫైన్ జువెల్స్ లిమిటెడ్ రూ.275.4 కోట్ల నిధులతో అక్టోబర్ 28న పబ్లిక్ ఇష్యూ ప్రారంభిస్తుండగా, అక్టోబర్ 30న ముగియనుంది. ఒక్కో షేరు ధర రూ.153-162గా ఉంది. అలాగే బీఎల్ఎస్ పాలీమర్స్ లిమిటెడ్ రూ.255 కోట్ల లక్ష్యంతో అక్టోబర్ 27 నుంచి 29 వరకు ఐపీఓకు రానుంది. బాంబే కోటెడ్ అండ్ స్పెషల్ స్టీల్ లిమిటెడ్ రూ.183.1 కోట్ల ఐపీఓ అక్టోబర్ 29న ప్రారంభమై నవంబర్ 2న ముగియనుంది.
Don’t receive OTP? Resend