కృత్రిమ మేధ ఉత్పాదకత పెంపు కంటే భద్రతాపరమైన ముప్పులను అర్థం చేసుకుని నివారించేందుకే కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వాలని ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్ సూచించారు. ఒరాకిల్ ఏఐ వరల్డ్ ఈవెంట్ లో ఒరాకిల్ సీఈవో క్లే మగౌయిర్క్ తో జరిగిన సంభాషణలో ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ వ్యవస్థలు ఊహించని విధంగా సాఫ్ట్ వేర్ లోపాలను గుర్తిస్తున్న తీరు చూసి తాను ఆశ్చర్యపోతున్నట్లు ఆయన తెలిపారు.
ఏఐ అనేది బగ్స్ ను సృష్టించడం లేదని, గత యాభై ఏళ్లుగా మనం అభివృద్ధి చేసిన వ్యవస్థల్లోని భద్రతా లోపాలను కనుగొనడంలో సాయం చేస్తోందని ఒరాకిల్ సీఈవో క్లే మగౌయిర్క్ వెల్లడించారు. ప్రతి బగ్ ను ఒక్కొక్కటిగా సరిచేయడం చాలా కష్టమని, అందుకే కొత్త పద్ధతులు అవసరమని సామ్ ఆల్ట్మన్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది తాను ఆశ్చర్యపోయిన విషయాల్లో ఏఐ మార్పు వేగం ఒకటని పేర్కొన్నారు.
దాదాపు నాలుగేళ్ల క్రితం చాట్ జీపీటీని ప్రారంభించినప్పుడు ప్రాథమిక పాఠశాల స్థాయి గణితాన్ని కూడా సరిగ్గా డీల్ చేయలేని మోడల్స్, ఇప్పుడు అత్యంత కఠినమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తున్నాయని ఆల్ట్మన్ తెలిపారు. తమను తాము ప్రోగ్రామర్లుగా భావించని వ్యక్తులు సైతం సొంత యాప్ లు రూపొందించుకునేందుకు ఏఐ వీలు కల్పిస్తోందని చెప్పారు. నా కంప్యూటర్ లోపల ఒక ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నట్లుగా ఉందని, తాను చేయడానికి ఇష్టపడని పనులను కూడా ఆటోమేటిక్ గా చేయగలుగుతున్నానని వివరించారు.
Don’t receive OTP? Resend