ప్రముఖ గ్లోబల్ డేటా ఇంజినీరింగ్, ఏఐ సర్వీసెస్ సంస్థ ఇన్నోడేటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారత్‌లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. దేశవ్యాప్తంగా దాదాపు 550 మంది సిబ్బందిని ఏకపక్షంగా ఉద్యోగాల నుంచి సాగనంపింది. ఎప్పటిలాగే విధుల్లో నిమగ్నమైన ఉద్యోగులకు మధ్యాహ్న సమయంలో ఈ ఊహించని షాక్ తగిలింది.
సోమవారం మధ్యాహ్న సమయంలో ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లు అనూహ్యంగా లాగౌట్ అయ్యాయి. కంపెనీ సిస్టమ్స్ నుంచి యాక్సెస్ కోల్పోవడంతో పాటు ఐడీలు డీయాక్టివేట్ అయ్యాయి. కొద్దిసేపటికే ఉద్యోగుల వ్యక్తిగత ఈ-మెయిల్ ఖాతాలకు తొలగింపునకు సంబంధించిన మెయిల్స్ అందాయి. హెచ్ఆర్ యాప్‌నకు కూడా యాక్సెస్ నిలిపివేయడంతో ఉద్యోగులు తమ పేస్లిప్లు, ఇతర కీలక డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కోల్పోయారు.
వ్యాపార అవసరాలకు తగ్గట్టుగా కంపెనీని పునర్వ్యవస్థీకరించే ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఉద్యోగుల పనితీరు ఆధారంగా తొలగింపులు జరగలేదని బాధిత సిబ్బందికి పంపిన ఈ-మెయిల్లో ఇన్నోడేటా యాజమాన్యం స్పష్టం చేసింది. ఫిలిప్స్టిన్స్లోని తమ కార్యాలయాల్లోనూ పలువురు ఉద్యోగులను సంస్థ తొలగించినట్లు సమాచారం.
అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్నోడేటా టెక్ కంపెనీలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను నిర్మించడానికి సహకరిస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు ఈ కంపెనీకి ప్రధాన కస్టమర్లుగా ఉన్నాయి. తాజా పరిణామాలు టెక్ రంగంలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
Don’t receive OTP? Resend