మైక్రోసాఫ్ట్ తన ప్రపంచవ్యాప్త ఉద్యోగుల్లో గణనీయమైన సంఖ్యకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని (Voluntary Exit Offer – VEO) అందించేందుకు సిద్ధమైంది. సుమారు 60,000 మంది ఉద్యోగులకు ఈ పథకం వర్తించవచ్చని అక్టోబర్ 26, 2026న వెలువడిన వార్తా కథనాలు పేర్కొన్నాయి. కంపెనీ కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించడంతో పాటు, కృత్రిమ మేధ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వనరులను మళ్లించడం ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మన్ సోమవారం ఈ పథకం గురించి ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు వార్తా నివేదికలు వెల్లడించాయి. అమెరికా, కెనడా, భారత్, బ్రిటన్‌లలోని ఎంపిక చేసిన బృందాలకు చెందిన ఉద్యోగులకు ఈ అవకాశం వర్తించనుంది.
60 వేల మంది అర్హులా?
మైక్రోసాఫ్ట్‌లో 2026 జూన్ 30 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,23,000 మంది పూర్తికాల ఉద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలో 60 వేల మంది ఉద్యోగులు ఈ పథకానికి అర్హులైతే, అది మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 27 శాతానికి సమానం. అయితే, ఈ సంఖ్యలోని ఉద్యోగులందరూ సంస్థను వీడతారని అర్థం కాదు. ఎంతమంది ఈ అవకాశాన్ని స్వీకరిస్తారనే దానిపై కంపెనీ ఎలాంటి లక్ష్యాన్ని ప్రకటించలేదు.మైక్రోసాఫ్ట్ అంతర్గత ఉద్యోగ స్థాయి (Level) 70 లేదా అంతకంటే తక్కువ ఉన్న ఉద్యోగులు, ఎంపిక చేసిన విభాగాల్లో పనిచేస్తుంటే ఈ పథకానికి అర్హులవుతారు. ఇందులో కొందరు సీనియర్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, వైస్ ప్రెసిడెంట్ హోదాలోని ఉద్యోగులు కూడా ఉండవచ్చు. అయితే, అన్ని విభాగాల ఉద్యోగులకు ఈ అవకాశం వర్తించదు. అర్హులైన ఉద్యోగులకు వ్యక్తిగతంగా ఈ పథకం వివరాలతో కూడిన ఈమెయిల్ పంపిస్తామని సంస్థ తెలిపింది.ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ చేపట్టిన తొలి స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి ఇది కొనసాగింపుగా నిలుస్తోంది. జులైలో Xbox గేమింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగాల కోతలను కూడా సంస్థ ప్రకటించింది. అయితే, ప్రస్తుత పథకం స్వచ్ఛందమైనది. అర్హత ఉన్న ఉద్యోగులు సంస్థను వీడాలా, కొనసాగాలా అన్నది వారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది
రాయిటర్స్ నివేదిక ప్రకారం, AI Experiences, Copilot, ఫైనాన్స్, మానవ వనరులు (HR), Xbox, Windows + Devices వంటి విభాగాల్లోని కొన్ని బృందాల ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు. మార్కెటింగ్, కమర్షియల్ బిజినెస్, సెక్యూరిటీ విభాగాలు మినహాయింపుల్లో ఉన్నాయి. కొన్ని సేల్స్, ఇంజినీరింగ్ బృందాలు కూడా ఈ పథకంలో పాల్గొనడం లేదు. ఏ బృందం ఇందులో భాగస్వామి కావాలనేది ఆయా విభాగాల వ్యాపార ప్రాధాన్యాలు, కస్టమర్ల అవసరాలు, సిబ్బంది అవసరాలపై ఆధారపడి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ పథకం కింద ఉద్యోగం వీడే వారికి ఆర్థిక సహాయం, కెరీర్ ప్రణాళికకు సంబంధించిన వనరులు అందిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. పరిహారం ఉద్యోగి హోదా, సేవా కాలం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అర్హులైన ఉద్యోగులు తమకు అందిన ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. భారత్‌లోని ఉద్యోగులకు డిసెంబర్ 1 వరకు గడువు ఉన్నట్లు ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
కృత్రిమ మేధ సాంకేతికత అభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్ భారీగా ఖర్చు చేస్తోంది. డేటా సెంటర్లు, కంప్యూటింగ్ సామర్థ్యం, AI చిప్స్ వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2026 క్యాలెండర్ సంవత్సరానికి మూలధన వ్యయాలు 175 బిలియన్ డాలర్లకు చేరవచ్చని కంపెనీ అంచనా వేసినట్లు రాయిటర్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో వ్యయాలను నియంత్రించడం, మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల కూర్పును మార్చుకోవడం సంస్థకు కీలకంగా మారింది.
Don’t receive OTP? Resend