హైదరాబాద్ సనత్‌నగర్ పరిధిలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. డ్రైఫ్రూట్స్ హోం డెలివరీ పేరుతో ఆన్లైన్ మోసానికి పాల్పడి విశ్రాంత ఉద్యోగిని నుంచి రూ.2.60 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
సనత్‌నగర్‌లోని లోధా అపార్ట్మెంట్లో నివసిస్తున్న విశ్రాంత ఉద్యోగి మీనా అహుజా ఇన్‌స్టాగ్రామ్‌లో డ్రైఫ్రూట్స్ హోం డెలివరీకి సంబంధించిన ప్రకటనను చూశారు. వెంటనే స్పందించి రూ.1700 విలువైన డ్రైఫ్రూట్స్‌ను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి నగదు చెల్లించారు. కొద్దిసేపటి తర్వాత అదే నంబరు నుంచి బాధితురాలికి ఫోన్ చేసిన వ్యక్తి ఆన్లైన్ చెల్లింపు రద్దయిందని, పార్సిల్ క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో వస్తుందని నమ్మబలికారు. అంతేకాకుండా అంతకుముందు చెల్లించిన రూ.1700 రీఫండ్ చేస్తామని చెప్పి ఆమెకు ఓ క్యూఆర్ కోడ్‌ను పంపారు.
సైబర్ వంచకుల మాటలను నమ్మిన బాధితురాలు ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగా ఆమె ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.21,700 డెబిట్ అయ్యాయి. ఆ డబ్బు కూడా వెంటనే తిరిగి జమ అవుతుందని నమ్మించిన నిందితులు మరో క్యూఆర్ కోడ్‌ను పంపి మళ్లీ స్కాన్ చేయించారు. ఈసారి ఏకంగా రూ.43,000 డెబిట్ అయ్యాయి. ఇలా వివిధ దఫాలుగా బాధితురాలి ఖాతా నుంచి మొత్తం రూ.2,60,100 స్వాహా చేశారు.
ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు కోల్పోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ నంబర్లు, క్యూఆర్ కోడ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్ ప్రకటనలు, తెలియని వ్యక్తులు పంపే క్యూఆర్ కోడ్ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Don’t receive OTP? Resend